కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2025-26లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులకు అదిరే శుభవార్త చెప్పింది. ఆదాయపు పన్నుకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నా ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టక్కర్లేదని తెలిపింది. స్టాండర్డ్ డిడక్షన్‌తో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు ఒక్క రూపాయి ట్యాక్స్ పడదు. అయితే, ఆ తర్వాత ఒక్క రూపాయి ఎక్కువగా ఉన్నా ట్యాక్స్ రిబేట్ వర్తించదని, దీంతో రిబేట్ రూ.60 వేలు, ఆపైన పన్ను శ్లాబుల ప్రకారం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. రూ.13 లక్షలు, రూ.14 లక్షలు వార్షిక ఆదాయం ఉన్న వారు అధికంగా పన్ను చెల్లించాల్సి వస్తుందనే చర్చ కొనసాగుతోంది. అయితే కొత్త పన్ను విధానంలోనే ట్యాక్స్ కట్టకుండా తప్పించుకోవచ్చని సీఏ సూరజ్ లఖోతియా చెబుతున్నారు.. అది ఎలాగో ఇప్పుడే తెలుసుకోండి.
మీ ఆదాయం ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువగా ఉన్నా పన్ను కట్టకుండా తప్పించుకోవచ్చు. అందుకు కొత్త పన్ను విధానం గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్, రిబేట్ మినహా ఎలాంటి పన్ను మినహాయింపులు లేవనే అందరూ భావిస్తున్నారు. నిజమే, సెక్షన్ 80సీ కింద మినహాయింపులు లేవు. కానీ, కొత్త పన్ను విధానంలోనూ కొన్నింటికి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చింది కేంద్రం. అందులో ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ కంట్రిబ్యూషన్ ఉన్నాయి. ఈ రెండింటికి కంపెనీ యాజమాన్యాలు చెల్లించే కంట్రిబ్యూషన్‌కి పన్ను మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80 CCD(2) కింద ఎన్‌పీఎస్ కంట్రిబ్యూషన్ కొత్త పన్ను విధానంలోనూ సాధ్యం అవుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదనే చెప్పాలి.
రూ.14.32 లక్షల ప్యాకేజీ ఉన్నా నో ట్యాక్స్
ఒక ఉదాహరణతో రూ.14,32,500 ప్యాకేజీపై ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా ఎలా తప్పించుకోవచ్చో తెలుసుకుందాం. ఈ విషయాన్ని సీఏ సూరజ్ లఖోతియా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వివరించారు. ఆయన CTC (వార్షిక ప్యాకేజీ) రూ.14,32,500 ఉంది. కానీ, ఒక చిన్న చిట్కాతో ట్యాక్స్ తప్పించుకోవచ్చంటున్నారు లకోతియా. ప్యాకేజీలో ఎంప్లాయర్ పీఎఫ్ కంట్రిబ్యూషన్ బేసిక్ శాలరీ (రూ.7,16,250)పై 12 శాతంతో ఏడాదికి రూ.85,950 చెల్లించాలి. అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్‌కి ఏడాదికి 10 శాతం చొప్పున ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ చెల్లించినట్లయితే అది రూ.71,625 అవుతుంది. అలాగే మీకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు వస్తుంది.
ఈ మొత్తం రూ.2,32, 575 అవుతుంది. దానిని మీ మొత్తం ప్యాకేజీ రూ.14,32,500 నుంచి తీసేయాలి. అప్పుడు ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వేతనం రూ.11,99,925 అవుతుంది. అంటే బడ్జెట్ 2025లో ప్రకటించిన ప్రకారం మీకు ట్యాక్స్ రిబేట్ వర్తిస్తుంది. దీంతో మీరు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. బేసిక్ శాలరీలో 14 శాతం వరకు ఎన్‌పీఎస్ కంట్రిబ్యూషన్ చేసుకోవడం సాధ్యం అవుతుందని సదరు సీఏ చేసిన పోస్టు కింద కొందరు కామెంట్స్ పెడుతున్నారు. 14 శాతం కంట్రిబ్యూషన్ చేస్తే మరింత తగ్గుతుంది.