ర్యాంగింగ్ పేరుతో తోటి విద్యార్థుల వేధింపులకు తాళలేక ఓ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కేరళను కుదిపేస్తోంది. జనవరి 15న చోటుచేసుకున్న ఈ ఘటన అందర్నీ కలచివేస్తోంది. తాజాగా, దీనిపై ఐడీ ఫ్రెష్ ఫుడ్ గ్లోబల్ సీఈవో పీసీ ముస్తఫా సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్కూల్‌లో ర్యాగింగ్ కారణంగా తన మేనల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ‘మిహిర్ నా మేనల్లుడు. నా కొడుక్కి బెస్ట్ ఫ్రెండ్.. నాకు బిడ్డతో సమానమైన మిహిర్ ఇప్పుడు ఈ లోకంలో లేడు.. కిండర్‌గార్టెన్ చదువుతున్నప్పుడు మాతో పాటు బెంగళూరులో కొన్ని రోజులు ఉన్నాడు.. వాడు చనిపోయిన తర్వాత భయానక దృశ్యాలు మాకు అందాయి.
తోటి విద్యార్థుల్లో కొందరు అతడిని దూషించి, కొట్టారు.. అత్యంత దారుణంగా వ్యవహరించారు.. అతడి రంగు గురించి ఎగతాళి చేశారు.. పాఠశాలలోనూ.. స్కూల్ బస్సులోనూ వేధించారు.. చివరకు ఆత్మహత్యకు ముందు కూడా ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నాడు.. వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి అతడితో బలవంతంగా టాయ్‌లెట్ సీట్‌ను నాకించి.. తలను అందులో ఉంచి ఫ్లష్ కొట్టారు.. మిహిర్ మరణాన్ని వేడుకగా భావించారని కొన్ని ఫోటోలను చూస్తే తెలిసింది.. ఇవి చూసిన తర్వాత నాకు కన్నీళ్లు ఆగలేదు. 15 ఏళ్ల బాలుడితో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా..? అతడి మరణం వృథా కారాదు.. బాధ్యులను చట్టం ప్రకారం శిక్షించాలి.. న్యాయం కోసం వేడుకుంటున్నా.. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా నిరోధించాలి.’’ అని ముస్తఫా ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు.
మరోవైపు, ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ వాద్రాలు స్పందించారు. ఇది హృదయవిదారకమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. నటి సమంత సైతం ఈ ఘటన గురించి తెలిసి తాను షాక్ అయినట్లు చెప్పారు. ‘ఇది 2025.. అయినప్పటికీ ద్వేషం, విషంతో నిండిన కొందరు వ్యక్తుల కారణంగా ఓ చిన్నారి తన జీవితాన్ని కోల్పోయాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 15న ఎర్నాకులంలోని గ్లోబల్ పబ్లిక్ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తమ కుమారుడు ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులను తెలియజేస్తూ మిహిర్ తల్లి రజ్నా పీఎం సోషల్ మీడియా వేదికగా ఆవేదన వెళ్లగక్కడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. కోచిలోని జీఈఎంఎస్ మోడర్న్ అకాడమీలో చదువుకున్నప్పుడు కూడా తన కుమారుడ్ని స్కూల్ నుంచి సస్పెండ్ చేసి వైస్ ప్రిన్సిపల్ బిను అజీజ్ మానసికంగా వేధింపులకు గురిచేశారని అన్నారు. ఆ ఘటన తర్వాత నవంబరు 2024లోనే గ్లోబల్ పబ్లిక్ స్కూల్‌కు మార్చారు.