యాక్సియోమ్ మిషన్ -4లో భాగంగా భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్, ఇస్రో ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో అడుగుపెట్టనున్నారు. దీంతో ఐఎస్ఎస్‌కు వెళ్తోన్న మొదటి భారతీయుడిగానూ.. రోదసీలో అడుగుపెడుతోన్న రెండో భారతీయుడిగానూ శుక్లా చరిత్ర సృష్టించనున్నారు. 40 ఏళ్ల కిందట 1984 ఏప్రిల్‌లో భారత్‌కు చెందిన రాకేశ్ శర్మ రష్యా వ్యోమనౌక సోయజ్ టీ-11 వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ కు శుభాన్షు శుక్లా పైలట్‌గా వ్యవహరించనున్నారు. ఇందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యాక్సియోమ్–4 మిషన్‌లో నలుగురు ప్రైవేట్ వ్యోమగాములు ఐఎస్ఎస్‌కు చేరుకుని... అక్కడ రెండు వారాలు పాటు పరిశోధనలు సాగించి.. భూమికి తిరిగి వస్తారు.
ఈ ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కూడా భాగస్వామిగా ఉంది. డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు నాసా మాజీ ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్ సారథ్యం వహిస్తున్న ఈ మిషన్ కోసం శుభాన్షు శుక్లా, పోలాండ్‌కు చెందిన ఉజ్‌నాన్‌స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కపూలను ఎంపిక చేశారు. మొత్తం నలుగురు వ్యోమగాములు స్పేస్‌ఎక్స్ నౌకలో ఐఎస్‌ఎస్‌కు చేరుకుంటారు. త్వరలోనే చేపట్టబోయే ఈ ప్రయోగానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్‌గా పనిచేస్తున్న శుభాన్షు శుక్లా.. ఇస్రో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష మిషన్ గగన్‌యాన్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో ఒకరు.
ఇందు కోసం నాసా, రష్యా స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ ఏరో స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీలోనూ శిక్షణ పొందారు. ‘‘సూక్ష్మ గురుత్వాకర్షణలోకి వెళ్లే అంతరిక్ష ప్రయాణాన్ని నేనే ఆస్వాదించడానికి ఉత్సాహంగా ఉన్నాను... దీని కోసం ఎదురుచూస్తున్నాను.. గత నాలుగైదు నెలల నుంచి శిక్షణ తీసుకుంటున్నాను.. కాన్సెప్ట్ ఆఫ్ ఆపరేషన్ (CONOPS) మొత్తాన్ని అవగాహన చేసుకున్నా.. ఇక్కడి నుంచి ముందుకు వెళితే మనం నేర్చుకున్నవి పునరావృతం చేయాల్సి ఉంటుంది.. కాబట్టి ఈ మిషన్‌ను విజయవంత చేయడానికి పూర్తి సామర్థ్యంతో మేము సిద్ధంగా ఉన్నాం.. నమ్మకంగా ఉన్నాం’’ అని శుక్లా వ్యాఖ్యానించారు.
‘అయితే, అంతకంటే ముఖ్యమైన అంశం ఏమిటంటే.. మనం భూమి ఉన్నప్పుడు సాధన చేయాలి.. తద్వారా మనకు శారీరక, మానసిక ఆరోగ్యం కలిగి పూర్తి ఉత్సాహంతో లక్ష్యాన్ని అమలు చేయడానికి వీలు కల్పిస్తుంది.. ఈ మిషన్ కోసం నేను ఎంతో ఉత్సాహాంగా ఎదురుచూస్తున్నాను.. ఇందుకు సంబంధించిన శిక్షణ పూర్తిచేశాను.. నా సామర్థ్యంపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది.. నేను యోగా చేయడానికి ప్రయత్నిస్తాను’ అని శుక్లా అన్నారు.