రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్, రైల్వే, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యేందుకు లోకేశ్ ఢిల్లీ వెళుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారు. సాయంత్రం 5.45 గంటలకు కేంద్ర మంత్రితో భేటీ అవుతారు. అనంతరం బుధవారం రాత్రే రాష్ట్రానికి తిరిగివస్తారు. ఏపీ ప్రభుత్వం కృత్రిమ మేధ(ఏఐ)కు అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విశ్వవిద్యాలయం ఏర్పాటు వంటి అంశాలపై కేంద్ర మంత్రితో లోకేశ్ చర్చించనున్నారు. కృత్రిమ మేధపై శిక్షణ, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఆర్టిఫిషియల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ప్రారంభించనున్న నేపథ్యంలో వాటికి కేంద్రం నుంచి సహకారాన్ని కోరనున్నారు.