ఒడిశాలోని కలహండి ఏరియా కమిటీ సభ్యుడు సోడి ఉంగ అలియాస్ శీను,ఛత్తీగఢ్ దండకారణ్యం జేగురుగొండ మావోయిస్టు పార్టీ సభ్యుడు హేమల భీమా పోలీసుల ఎదుట లొంగిపోయారు. అల్లూరి జిల్లా ఎటపాక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో జిల్లా ఓఎస్డీ జగదీశ్ అడహళ్లి ఈ వివరాలను వెల్లడించారు. ఉంగ అలియాస్ శీను మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై 2016 మేలో జేగురుగొండ ఎల్‌వోఎస్ కమాండర్ సోడి లింగే సమక్షంలో సభ్యుడిగా చేరాడు. ఇతడు 2016, 2018, 2020 సంవత్సరాల్లో ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లు దహనం చేసిన ఘటనల్లో పాల్గొన్నాడు. హేమల భీమా 2021లో మావోయిస్టు పార్టీలో సభ్యుడిగా చేరాడు. 2023లో జేగురుగొండ సమీపంలోని కుందేడు గ్రామ శివారులో జరిపిన దాడిలో పాల్గొన్నాడు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు మరణించారు. ఉంగ అలియాస్ శీనుపై రూ.4లక్షలు, భీమాపై రూ.లక్ష రివార్డులు ఉన్నాయి.