తిరుమల శ్రీవారికి సోమవారం ఓ అరుదైన విరాళం అందింది. భారత్ సహా వివిధ దేశాల్లో విపత్తు అధికారిగా సేవలందించిన రేణిగుంటకు చెందిన సీ మోహన తన జీవితకాలంలో ఆదా చేసిన ప్రతి పైసాను శ్రీవారికి కానుకగా ఇచ్చారు. టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయాస్ (ఎస్వీ బాలమందిర్) ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందజేసిన ఆమె వాటిని టీటీడీ విద్యా సంస్థల్లో చదువుతున్న అనాథ, పేద పిల్లల సంక్షేమం కోసం వినియోగించాలని కోరారు. విరాళం మొత్తాన్ని మంగళవారం డీడీ రూపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.