రాష్ట్రంలోని ఫోర్‌లైన్, డబుల్‌లైన్ రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని రోడ్లు, భవనాల శాఖమంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. దీనికోసం 3,500కి.మీ. మేర పీపీ మోడల్ తరహాలో అంచనాలు తయారు చేశామని, త్వరలో కేంద్రమంత్రి గడ్కరీని కలిసి వీటిని అందజేస్తామని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ పాలనతో రాష్ట్రం నాశనమైందని విమర్శించారు. రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయని, ఆ గుంతలను పూడ్చడానికి కూటమి ప్రభుత్వం రూ.1,061 కోటు మంజూరు చేసిందని తెలిపారు. మొత్తం 23,400 కి.మీ. మేర రహదారులు పాడవగా, ఆరు నెలల్లోనే 18వేల కి.మీ. రహదారులపై గుంతలు పూడ్చి, నాణ్యమైన రహదారులు వేశామని చెప్పారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన కూటమి ప్రభుత్వం లక్ష్యమని, ఇప్పటికే 5 లక్షల ఉద్యోగాలు కల్పించామని మంత్రి తెలిపారు.