ముడా భూముల కుంభకోణంతో సతమతమవుతున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై తాజాగా బినామీ ఆస్తుల ఆరోపణ వచ్చింది. ఆయన తన బావ మరిది పేరున బినామీ ఆస్తులను కూడబెట్టారని ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. సిద్ధరామయ్య ఇప్పటికే కెసరె గ్రామంలోని 3.16 గుంటల భూమిని పసుపు-కుంకుమ సంప్రదాయం కింద బదిలీ చేశారని.. అయితే ఇప్పుడు అదనంగా ఆయన బావమరిది మల్లికార్జున స్వామి ఒక ఎకరా భూమిని దానం చేశారని ఆయన తెలిపారు. దీనిపై సిద్ధరామయ్య మౌనంగా ఉన్నారని.. ఈ లావాదేవీల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని కృష్ణ ప్రశ్నించారు.సిద్ధరామయ్య భార్య పార్వతి కుటుంబ ఆస్తులపైనా, మల్లికార్జున స్వామి సంపాదించిన ఆస్తులపైనా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక ఎకరా భూమి కొనుగోలును ముడా డీ-నోటిఫై చేయడంపై సిద్ధరామయ్య ప్రభావం ఉందని కృష్ణ వాదిస్తున్నారు. అదే భూమిని అక్టోబర్, 2010లో పార్వతికి దానమిచ్చారు. ఆ తర్వాత నెలకే ఆమె ఆ భూమిని తన కొడుకు యతీంద్రకు బదలాయించారు. ఆ తర్వాత నాలుగు నెలలకే దాన్ని యతీంద్ర మూడో పార్టీకి అమ్మేశారు. లోకాయుక్త ఈ బినామీ బాగోతంపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణ డిమాండ్ చేశారు.