తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశంపై నిర్లక్ష్యం వహిస్తున్నందున ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ పిలుపు మేరకు ఈనెల7న చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు సవరపు భైరవమూర్తి పిలుపునిచ్చారు. నడిపూడి డాక్టర్ బాబూజగ్జీవన్‌రామ్ కమ్యూనిటీ ప్రాంగణంలో ఆకుమర్తి రమేష్‌మాదిగ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి మాదిగ ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా హాజరైన భైరవమూరి మాట్లాడుతూ లక్ష డప్పులు.. వేల గొంతుకల పేరుతో చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జిల్లాలోని మాదిగ సోదరులు విజయవంతం చేయాలని కోరారు.
డప్పులు మోగించుకుంటూ సభా ప్రాంగణానికి చేరుకోవాలన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మందకృష్ణమాదిగకు పద్మశ్రీ ప్రకటించడంతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం చలో హైదరాబాద్ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఎమ్మెస్పీ, ఎమ్మార్పీఎస్ జిల్లా, మండలశాఖల ప్రతినిధులు సత్తాల దుర్గారావు, యార్లగడ్డ రామకృష్ణ, లూటుకుర్తి సత్యనారాయణ, వీధి చిరంజీవి, వంగలపూడి నరసింహమూర్తి, చుట్టుగుళ్ల సత్తిబాబు, నేదునూరి నతానియేలు, గంపల సత్యదుర్గాప్రసాద్, ఆకుమర్తి ఆశీర్వాదం, మల్లవరపు సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.