2025 బడ్జెట్ ని నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి1 న పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 12 లక్షల ఆదాయ పన్ను మినహాయింపుతో ఒక్కసారిగా మధ్యతరగతి వేతనదారుల దృష్టిలో మంచి మార్కులే పడ్డాయి ఈ బడ్జెట్ కి. అలాగే డెలివరీ వర్కర్స్ (గిగ్ వర్కర్స్), రైతులకు, ఎస్సి ఎస్టి మహిళలకు 2 కోట్ల వరకు రుణాలు వంటి వాటితో కొంత ఈ సారి బడ్జెట్ సామాన్యులు కొంత ఉపశమనం పొందేలా చేసింది. ఈ సారి పూర్తిగా బడ్జెట్ వ్యూహబద్ధంగా రచించిందేనని స్పష్టమవుతుంది. ఒకపక్క బీహార్ జేడియు తో పొత్తు వల్ల అక్కడ ప్రభుత్వాన్ని మంచి చేసుకోవాల్సిన ఆవశ్యకత, ఇంకో పక్క ఆం ఆద్మీ పార్టీతో ఈ ఫిబ్రవరి 5 న ఎన్నికల సమరంలో బరిలోకి దిగాల్సి రావడం వల్ల కొంత ఈ రెండు రాష్ట్రాలలో బిజేపి తన పట్టును నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం చివర్లో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ సారి బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ బీహార్ కు ఆర్ధిక వరాలు కురిపించడం గమనార్హం.
బీహార్ లో మఖానా బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు బడ్జెట్ సాక్షిగా ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఈ ప్రకటన వల్లే పూల్ మఖానా పై అందరికి ఆసక్తి కూడా పెరిగింది. ఆరోగ్యకరమైన డైట్ లో ఎక్కువగా వినిపించే పౌష్టిక ఆహారమే ఈ మఖానా. ఈ మఖానా బోర్డు ద్వారా అక్కడి రైతులకు మేలు జరిగేలా చేయడం; అలాగే ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడేలా చూడటమే ఈ బోర్డు లక్ష్యం. అలాగే దీని ద్వారా రైతులకు శిక్షణ ఇవ్వడం, వారు అన్ని ప్రభుత్వ పథకాల కింద ప్రయోజనాలు పొందేలా చూడటం కూడా దీని లక్ష్యమని ఆర్ధిక శాఖ మంత్రి స్పష్టం చేసారు. ఈ ఒక్క బోర్డు మాత్రమే కాదు ఇంకెన్నో పథకాల శుభవార్తలు ప్రకటించారు.
బీహార్ లోని మిథిలాంచల్ ప్రాంతంలో యాభై వేల హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్ కు ఆర్ధిక సాయం అందిస్తామని; ఐఐటి పాట్నా సామర్థ్యాన్ని పెంచుతామని, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు, నేషనల్ ఇన్ స్టిట్యుట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ,ఎంటర్ ప్రేన్యుర్ షిప్ అండ్ మేనేజ్ మెంట్ వంటివి కూడా ఏర్పాటు చేయబోతున్నారని ప్రకటన వచ్చింది. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన మద్దతుగా నిలిచినా జేడియూ ఎన్ డి ఏ లో కీలక భాగస్వామి. ఇంతకుముందు బీహార్ కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పింది కేంద్రం. ఇప్పుడు మాత్రం ఎన్నికల ముందు వరాల జల్లు కురిపించింది. ఇది కొంత ఎన్నికల కోసం చేసిన చర్యగానే ఉందని కూడా విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక డిల్లి విషయానికి వస్తే ఈ ఐదవ తేదిన జరిగే ఎన్నికల్లో ఆం ఆద్మీ పార్టికి బిజెపి గట్టి పోటి ఇచ్చే పనిలో పడింది. ఇప్పటికే ఈ జనవరి 31 న ఏడుగురు ఎమ్మల్యేలు కేజ్రివాల్ కి షాక్ ఇస్తూ బిజెపిలో చేరారు. ఇక బడ్జట్ లో నిర్మలా సీతారామన్ ప్రకటించిన 12 లక్షల ఆదాయ పన్ను మినహాయింపు కూడా ఈ సారి బిజెపికి కలిసి వచ్చేలానే ఉంది. డిల్లిలో ఇన్కం టాక్స్ కట్టే వారు 40 లక్షల మంది ఉండటం వల్ల వారందరికీ ఈ పన్ను మినహాయింపు కలిగిస్తుంది. ఈ రకంగా చుస్తే వేతన జీవుల వోట్లను ఈ చర్యతో బిజెపి తన ఖాతాలో వేసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. డిల్లీలో ఎన్నికల్ కోడ్ అమలులో ఉండటంతో ఎన్నికల నియమాలను అనుసరించి ఈ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అయినప్పటికీ బడ్జెట్ లో వ్యూహాత్మక రచనతో బిజెపి మాత్రం తమ అధికార స్వరాన్ని ఈ సారి స్థాపించేందుకు గట్టి ప్రయత్నమే చేసిందని చెప్పాలి. ఎందుకంటే డిల్లి జనాభాలో దాదాపు 45 శాతం మంది మధ్యతరగతి ప్రజలు కాగా అందులో పన్ను చెల్లించే వారి సంఖ్యా దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. ఈ 12 లక్షల పన్ను మినహాయింపు వల్ల దాదాపు దేశవ్యాప్తంగా కోటి మంది ఊరట పొందుతారని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఆ కోటి మందిలో ఎక్కువ శాతం డిల్లికి చెందిన వారే అవుతారు; అందుకే ఈ బడ్జెట్ ప్రత్యక్షంగా డిల్లి ఎన్నికలలో విజయం కోసం చేయకపోయినా; పరోక్షంగా మాత్రం ఈ ఎన్నిక లో గెలుపు కోసం తెలివిగా చేసిన చర్యగానే కనిపిస్తుంది. ఇంకోవైపు రాబోతున్న డిల్లి అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడానికి రాష్ట్రంలోని ప్రజలను ఆకర్షించేందుకు ఇప్పటికే బిజెపి,ఆప్, కాంగ్రెస్ పథకాల హామీలను గుప్పించాయి. ఇప్పటివరకు టాక్స్ విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కున్నా బిజెపి ఈ సారి బడ్జెట్ తో మాత్రం ఆ విమర్శలను కొంత తిప్పి కొట్టిందనే అనుకోవాలి.
ఇటు ప్రత్యక్షంగానే బీహార్ కోసం బడ్జెట్ లో పథకాల వరాలు ప్రకటించింది బిజెపి ప్రభుత్వం. కొంత ఈ బడ్జెట్ దేశ బడ్జెట్ ల కాకుండా బీహార్ బడ్జెట్ లా మారాయన్న విమర్శలు వినిపిస్తూ ఉన్నా, భవిష్యత్తులో రాబోయే డిల్లి ఎన్నికలు, తర్వాత సంవత్సారంతంలో జరగబోయే బీహార్ లో ఎన్నికలు మాత్రమే రాజకియపరంగా ఈ బడ్జెట్ బిజెపి కి కలిసి వచ్చిందో లేదో తేల్చగలవు. చూద్దాం! ఈ సారైనా డిల్లీలో కమల ప్రతిస్థాపన జరుగుతుందేమో!