ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 5న (బుధవారం) ఆయన త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నట్లు సమాచారం. ఈమేరకు ప్రధాని షెడ్యూల్‌ను ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి చెప్పినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.‘‘బుధవారం ఉదయం 10 గంటలకు ప్రధాని ( ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10.45 గంటలకు అరైల్ ఘాట్‌కు వెళ్తారు. ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటారు. ఉదయం 11 నుంచి 11.30 గంటల మధ్య త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరిస్తారు. 11.45 గంటలకు బోటులో తిరిగి అరైల్ ఘాట్‌కు వెళ్తారు. అక్కడి నుంచి ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి దిల్లీ బయల్దేరుతారు’’ అని సదరు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించినట్లు ఆ కథనాల సమాచారం.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనబోరని తెలుస్తోంది. కేవలం పుణ్యస్నానం ఆచరించి గంగానదికి పూజలు చేయనున్నారని సమాచారం. దాదాపు గంటన్నర పాటు మోదీ ప్రయాగ్‌రాజ్‌లో ఉండనున్నారు. ఈ క్రమంలోనే నగరంతో పాటు కుంభమేళా వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ప్రధాని వెంట యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉండనున్నారట.