మహాకుంభ్ మేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల లెక్కలను దాచిపెడుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి అసలైన లెక్కను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు లోక్‌సభలో మంగళవారంనాడు జరిగిన చర్చలో అఖిలేష్ మాట్లాడుతూ, మహాకుంభ్ ఏర్పాట్లపై మాట్లాడానికి బదులుగా ఆ ఆవెంట్‌ను ప్రచారం చేసుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బీజీగా ఉందన్నారు. 100 కోట్ల మంది భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశామని బీజేపీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అమృత్‌స్నాన్ సకాలంలో నిర్వహించడంలో విఫలమైందని, తొలిసారి అమృత్ స్నాన్ సంప్రదాయం దెబ్బతిందని అన్నారు. మహాకుంభ్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అసలు లెక్కల్ని ప్రభుత్వం తొక్కిపెట్టిందని అఖిలేష్ అన్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు జేసీబీలను ప్రభుత్వం ఉపయోగించిందని ఆరోపించారు. మహాకుంభ్ యాత్రకు వచ్చిన కుటుంబాలకు తమ ప్రియతములను కోల్పోయి మృతదేహాలతో వెనక్కి వెళ్లాల్సి వచ్చిందన్నారు. ప్రధాని, రాష్ట్రపతి సంతాపం తెలిపిన తర్వాత 17 గంటలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారని, ఘటన జరిగినట్టు అంగీకరించారని అన్నారు.