గంగా పూజ, హారతిలో పాల్గొన్న జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ .ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం గంగా పూజ, గంగా హారతిలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు రాష్ట్ర మంత్రులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించారు. భూటాన్ రాజు కాషాయ వస్త్రాలు ధరించి కుంభమేళాలో పాల్గొన్నారు.అంతకుముందు, భూటాన్ రాజు విమానంలో లక్నోకు చేరుకున్నారు. ఆయనకు యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇరువురు పలు అంశాలపై చర్చించారు. భారత్-భూటాన్ స్నేహం, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో జిగ్మే ఖేసర్ పర్యటన కీలకమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కుంభమేళాలో పాల్గొన్న అనంతరం భూటాన్ రాజు ఉత్తరప్రదేశ్ గవర్నర్ కార్యాలయంలో విందుకు హాజరయ్యారు.