అమలాపురం పరిధిలోని ఈదరపల్లి బొంతువారిపేటలోని రామాలయం సెంటర్‌లో మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా జరిగిన ప్రమాదంలో బాధిత కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. రూ.8లక్షలు ఆస్తి నష్టం ఏర్పడింది. అమలాపురం అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. రామాలయం సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గూటం ఇంద్ర, కుంచే మరియమ్మ, దాకే మంగాయమ్మ, మంగం సుజాతలకు చెందిన రెండు తాటాకిళ్లు, రెండు రేకుల షెడ్ల ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈప్రమాదంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో స్థానికులు ఒక దశలో మంటలు అదుపు చేసేందుకు భయపడ్డారు.
చివరకు మిగిలిన రెండు గ్యాస్ సిలిండర్లను బయటికి తీసుకువచ్చి తర్వాత మంటలను అదుపు చేశారు. గ్రామసర్పంచ్ రాయుడు వరలక్ష్మి తక్షణ సాయం కింద తన వంతుగా ఒక్కో కుటుంబానికి రూ.5వేలు చొప్పున అందజేశారు. బాధిత కుటుంబాలకు స్థానిక సచివాలయంలో వసతి కల్పించడంతో పాటు భోజన సదుపాయాలు కల్పిస్తున్నట్టు కార్యదర్శి కోడూరి వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అడపా సత్తిబాబు, ఉపసర్పంచ్ పోలిశెట్టి వీరబాబు, మల్లవరపు ప్రసాద్, పంచాయతీ తరపున డి.నాగబాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రమాద నష్టాన్ని అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో బండి సత్యనారాయణకు చెందిన బిల్డింగ్ దెబ్బతింది.