అప్పుల మీద అప్పులు చేయడమే సంపద సృష్టిలా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బడ్జెట్ బయట, లోపల ఏడాది తిరక్కుండానే ఏకంగా రూ.1.26 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్ సిక్స్‌లో ప్రధాన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తుండటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ సిక్స్‌లో ప్రధాన హామీలైన రైతు భరోసా, తల్లికి వందనం, ఆడ బిడ్డ నిధి అమలు చేయడం లేదు.
ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా 7.17 శాతం వడ్డీకి రూ.5,820 కోట్లు అప్పు చేసింది. దీంతో ఇప్పటి వరకు బడ్జెట్‌లోనే కేవలం మార్కెట్ రుణాల ద్వారా చేసిన అప్పులు రూ.80,827 కోట్లకు చేరాయి. బడ్జెట్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల ద్వారా రూ.71,000 కోట్లు అప్పు చేస్తామని తెలిపారు. ఆర్థిక సంవత్సరం పూర్తవ్వడానికి ఇంకా రెండు నెలలు మిగిలి ఉండగానే బడ్జెట్‌లో చెప్పిన దాని కంటే ఎక్కువగా ఏకంగా రూ.10 వేల కోట్లు అప్పు చేశారు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారెంటీలతో రూ.14,700 కోట్లు అప్పు చేశారు. మరో పక్క రాజధాని పేరుతో రూ.31 వేల కోట్లు అప్పులు చేస్తోంది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీ సంస్థ నుంచి రూ.5 వేల కోట్లు అప్పు చేస్తోంది. ఇందుకోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రాజధాని పేరుతో, వివిధ కార్పొరేషన్ల గ్యారెంటీల ద్వారా బడ్జెట్ బయట రూ.45,700 కోట్లు అప్పు చేస్తోంది అని తెలిపారు.