ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజ్రీవాల్ హయాంలో అవినీతిపై సిట్.. ఢిల్లీ సీఎం రేసులో ఉన్న పర్వేష్ వర్మ

national |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2025, 08:35 PM

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేసిన ఉద్యమం నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆప్.. కాంగ్రెస్ పార్టీతో కలిసి అధికారాన్ని చేపట్టింది. అయితే కొన్నిరోజులకే ఆప్, కాంగ్రెస్ మధ్య తీవ్ర విబేధాలు రావడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయి సీట్లతో ఆప్ ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ ప్రభంజనం కొనసాగించింది. దీంతో ఢిల్లీలో 10 ఏళ్లకు పైగా ఆప్ సర్కార్ పాలన చేసింది. అయితే ఈ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావించినా అది జరగలేదు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కమలం వికసించింది. అయితే అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి.. చివరికి అవినీతి మచ్చలే మిగిలాయి. మరీ ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. ఆ పార్టీని, పార్టీ ప్రతిష్ఠను బాగా దెబ్బతీసింది.


అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయని తెలియడంతోనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సచివాలయం నుంచి ఎలాంటి ఫైల్స్ గానీ, రికార్డులు గానీ, హార్డ్ డిస్క్‌లు గానీ బయటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో గతంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిపై విచారణ జరిపించి.. నిజానిజాలు వెలికి తీస్తామని ఇప్పటికే బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో బీజేపీ సర్కార్ ఏర్పాటు కాగానే.. ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.


  మరోవైపు.. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి.. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను మట్టికరిపించిన పర్వేష్ వర్మ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు. అందులో భాగంగానే గత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్‌ హయాంలో ఢిల్లీలో జరిగిన అవినీతిపై సిట్‌ వేయడానికే తమ తొలి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. ఇక ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ ముందు వరుసలో ఉన్నారు. కేజ్రీవాల్‌ను ఓడించడం.. ఆయనకు అదనపు బలాన్నిస్తోంది.


బీజేపీ హైకమాండ్ మద్దతుతోనే ఢిల్లీలో కమలం పార్టీ విజయం సాధ్యమైందని పర్వేష్ వర్మ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించడం ద్వారా ప్రధాని మోదీ నాయకత్వంపై తమకు ఉన్న విశ్వాసాన్ని చాటుకున్నారని వెల్లడించారు. ఢిల్లీలో గెలిచిన బీజేపీ ఎమ్మేల్యేలు అందరూ సమావేశమై.. తమ నాయకుడిని ఎన్నుకుంటామని.. ఢిల్లీ సీఎం వ్యాఖ్యలపై స్పందించారు. దానికి పార్టీ హై కమాండ్ కూడా ఆమోదం తెలుపుతుందని స్పష్టం చేశారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామని పర్వేష్ వర్మ స్పష్టం చేశారు.


ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని పర్వేష్ వర్మ తెలిపారు. అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.2500 చెల్లించడం.. ఢిల్లీలో అవినీతిపై సిట్‌ ఏర్పాటు చేయడం.. యమునా నది ప్రక్షాళన, ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడం.. ఢిల్లీ ట్రాఫిక్ సమస్యను తగ్గించడం తమ మొదటి ప్రాధాన్యాలు అని స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి పౌరుడు గర్వంగా చెప్పుకునేలా దేశ రాజధానిని అభివృద్ధి చెస్తామని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com