ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైలుకెళ్లొచ్చిన సోరెన్ మళ్లీ సీఎం అయ్యాడు.. కానీ కేజ్రీవాల్ ఎందుకు ఓడాడు?

national |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2025, 08:36 PM

జైలుకు వెళ్లొచ్చిన తర్వాత పాలిటిక్స్‌లో హీరో కావడం అనేది ఇటీవలి కాలంలో ఓ సెంటిమెంట్‌గా మారింది. ఏపీలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి, కన్నడ నాట డీకే శివ కుమార్, కశ్మీరాన ఒమర్ అబ్దుల్లా, జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ దీనికి ఉదాహరణలుగా చెప్పొచ్చు. అయితే జైలుకెళ్లొచ్చిన కేజ్రీవాల్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొని రాలేకపోవడమే కాదు.. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు.


పైన పేర్కొన్న నేతలు జైలుకు వెళ్లింది నిజమే. కానీ వీరిలో హేమంత్ సోరెన్ మినహా మిగతా నేతలంతా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అరెస్టయ్యి జైలుకెళ్లారు. జగన్ పార్టీ పెట్టిన కొత్తలోనే జైలుకు వెళ్లి 16 నెలల తర్వాత బయటకొచ్చారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయ్యి రాజమండ్రి జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇక ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి కూడా జైలుకు వెళ్లొచ్చారు. దక్షిణాదిన కాంగ్రెస్ కీలక నేతగా మారిన డీకే శివకుమార్ సైతం ఎన్నో కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది.


జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మాత్రం ముఖ్యమంత్రిగా ఉండగానే మనీ లాండరింగ్ కేసులో 2024 జనవరి 31న అరెస్టయ్యారు. దీనికి ముందే హేమంత్ తన పదవికి రాజీనామా చేయగా.. చంపై సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సుమారు 6 నెలల తర్వాత.. 2024 జూన్ 28న బెయిల్ మీద బయటకొచ్చిన హేమంత్ సోరెన్ తిరిగి సీఎం అయ్యారు.


2024 నవంబర్లో జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే జార్ఖండ్‌లో ఆయన ఒంటరిగా కాకుండా.. కాంగ్రెస్, ఆర్జేడీ తదితర పార్టీలతో కలిసి ‘మహాఘట్ బంధన్’గా బరిలోకి దిగారు. జార్ఖండ్ అసెంబ్లీలో 81 సీట్లు ఉండగా.. మహాఘట్ బంధన్‌కు 56 సీట్లు వచ్చాయి. అందులో హేమంత్ సోరెన్ సొంత పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా 34 సీట్లు గెలుపొందింది. మరో వైపు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి 24 సీట్లు సాధించింది. ఎన్నికల ముందు చంపై సోరెన్ బీజేపీలో చేరినా.. హేమంత్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఢిల్లీ తరహాలోనే జార్ఖండ్ ఎన్నికల్లోనూ పార్టీలు పోటాపోటీగా సంక్షేమ పథకాలను, ఉచితాలను ప్రకటించాయి. జార్ఖండ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలతోపాటు ఆదివాసీల భూమి హక్కు ప్రచారాంశంగా మారింది.


అధికారంలో ఉండగానే అరెస్టయి బెయిల్ మీద బయటకొచ్చిన హేమంత్ సోరెన్ ప్రజలు ఆదరించడానికి చాలా కారణాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జార్ఖండ్‌లో 86 లక్షల మంది ఆదివాసీలు ఉన్నారు. ఆ రాష్ట్ర జనాభాలో ఇది 26.2 శాతం. వీరు జేఎంఎంకు అండగా నిలిచారు. సంక్షేమ పథకాలతో మహిళా ఓటర్లు సైతం హేమంత్ సోరెన్‌కు మద్దతు పలికారు. జైలుకు వెళ్లి రావడంతో ఆయన పట్ల సానుభూతి ఏర్పడింది. హేమంత్ భార్య కల్పన ఇమేజ్ కూడా జేఎంఎం కూటమికి కలిసొచ్చింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు అని బీజేపీ చేసిన ప్రచారాన్ని హేమంత్ సోరెన్ తెలివిగా తిప్పి కొట్టారు. సరిహద్దుల నుంచి అక్రమంగా వలసలు అనేది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యం అని సోరెన్ తెలివిగా ప్రచారం చేశారు. ఈ వాదనతో జనం ఏకీభవించారు. గ్రామీణ ఓటర్లు ఎక్కువగా ఉండటం, ఆదివాసీలు, మైనార్టీలు అండగా ఉండటం లాంటి అంశాలు హేమంత్ సోరెన్‌కు ఈ ఎన్నికల్లో కలిసొచ్చాయి.


ఇక ఢిల్లీ ఎన్నికల విషయానికి వస్తే.. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎన్నికల ముందు అరెస్టయ్యారు. అదే లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్‌లో నంబర్ 2గా పరిగణించే మనీష్ సిసోడియా చాలా కాలం జైలు జీవితం గడిపారు. జైలుకు వెళ్లినప్పుడు హేమంత్ సీఎం పదవికి రాజీనామా చేయగా.. అరవింద్ కేజ్రీవాల్ దానికి భిన్నంగా జైలు నుంచే పాలనా వ్యవహరాలను తన ప్రతినిధి ఆతిశీ సాయంతో చక్కబెట్టారు. జైలు నుంచి బయటకొచ్చాక మాత్రం ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి ఆతిశీకి ఆ బాధ్యతలు అప్పగించారు.


ఢిల్లీ, జార్ఖండ్.. రెండు రాష్ట్రాల ఓటర్ల ఆలోచన సరళి భిన్నంగా ఉంటుంది. గ్రామీణ ఓటర్ల సానుభూతి పొందడం తేలిక. కానీ పట్టణ ఓటర్లు మాత్రం ఆలోచిస్తారు. సీఎం స్థాయి వ్యక్తి జైలుకు వెళ్లాడంటే.. అదేమంత ఆషామాషీ వ్యవహారం కాదని విద్యావంతులకు తెలుసు. దీంతో కేజ్రీవాల్‌కు సానుభూతి పొందే అవకాశం లేకుండా పోయింది లేదా తక్కువగా ఉంది. అంతే కాకుండా సంక్షేమ పథకాలు, ఉచితాల విషయంలో చూపిన శ్రద్ధను ఆప్ సర్కారు అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన విషయంలో చూపెట్టలేకపోయింది. దీంతో ఢిల్లీలో పొల్యూషన్ పెద్ద సమస్యగా మారింది. ట్రాఫిక్ చిక్కులు, తాగునీటి కష్టాలు కూడా పెరిగాయి. ఇవన్నీ ఢిల్లీ ప్రజలను ఆప్‌కు దూరం చేశాయి. లెఫ్టినెంట్ గవర్నర్ వల్ల ఆప్ సర్కారు సైతం పనుల్లో దూకుడు చూపలేకపోయిందని చెబుతారు.


అంతే కాదు ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్న బీజేపీ సామ దాన బేధ దండోపాయాలను ప్రయోగించింది. క్షేత్ర స్థాయిలో ఓటర్లను తమవైపు తిప్పుకోవడం కోసం ఆరెస్సెస్ సైతం రంగంలోకి దిగింది. చివర్లో మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకోవడం కోసం రూ.12 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారిని ఆదాయపన్ను నుంచి మినహాయించారు. ఆప్‌కు పోటీగా కమలం పార్టీ సైతం ఉచితాలు ప్రకటించింది. ఇవన్నీ బీజేపీకి కలిసి వచ్చాయి.


మరోవైపు ఓవర్ కాన్ఫిడెన్స్‌కు పోయిన కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌ను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేయలేదు. దీంతో ఢిల్లీలో గెలవడం కాదు.. ఆప్‌ను దెబ్బతీయడమే లక్ష్యం అన్నట్టుగా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు పని చేశాయి. కాంగ్రెస్ ఓట్లు చీలకపోయి ఉంటే.. అంటే ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరి ఉంటే.. పోరు హోరాహోరీగా జరిగి ఉండేది. కానీ ఆప్ ఆ అవకాశాన్ని కాదనుకుంది. ఇవన్నీ కలిసి కేజ్రీవాల్ ఓటమికి దారి తీశాయి.


మరో కీలక విషయం ఏంటంటే.. జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి ఐదేళ్లు అధికారంలో ఉండి రెండోసారి తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆప్ మాత్రం ఇప్పటికే రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించే క్రమంలో ఓడింది. అంటే హేమంత్ సోరెన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతతో పోలిస్తే.. ఆప్ ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పొత్తులను లైట్ తీసుకున్న కేజ్రీ మునిగితే.. అదే పొత్తులతో సోరెన్ మళ్లీ సీఎం అయ్యాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa