దేశరాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తినలో ప్రభుత్వ ఏర్పాటుకు కాషాయ దళం సిద్ధం అవుతుండగా.. తాజాగా దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. తమ పార్టీ గెలుపుపై సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అలాగే ఢిల్లీలో చారిత్రాత్మకమైన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఢిల్లీ ఎన్నికల్లో విజయంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజా శక్తి అత్యున్నతమైనదని.. అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని చెప్పుకొచ్చారు. అలాగే చారిత్రాత్మక విజయాన్ని అందించినందుకు గాను ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీరు అందించిన అపారమైన ఆశ్రీవాదాలు, ప్రేమకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు. ఢిల్లీ సమగ్ర అభివృద్ధికి, అక్కడి ప్రజల జీవనాన్ని మెరుగు పరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
ఇది తమ హామీ అని చెబుతూనే.. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో ఢిల్లీ కీలక పాత్ర పోశించేందుకు నిరంతరం కృషి చేస్తామని ప్రధాని మోదీ వివరించారు. అలాగే ఢిల్లీలో గెలుపు కోసం రాత్రిపగలు అనే తేడా లేకుండా కష్టపడ్డ బీజేపీ కార్యకర్తలు, నేతలు, అభ్యర్థులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం మోదీ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది నేతలు మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇచ్చిన హామీల మేరకే దేశ రాజధాన్ని అబివృద్ధి చేయాలని చెబుతున్నారు.
ఢిల్లీలో మొత్తంగా 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 47 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 23 స్థానాలనే దక్కించుకుని ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ అయితే కనీసం ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. 2020లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే జరగ్గా.. బీజేపీ కేవలం 8 సీట్లే గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఏకంగా 62 స్థానాలు దక్కించుకుని విజయం సాధించింది.