కాకినాడ జిల్లా తునిలోని శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయం.. హైవే పక్కనే ఉంటుంది. సమీపంలోనే డిమార్ట్ ఉంటుంది. ఇక డిమార్ట్‌కు వచ్చే కస్టమర్లు, రోడ్డుపై వాహనాల రాకపోకలతో వాతావరణం కాస్త హడావిడిగానే ఉంటుంది. అలాంటి చోట.. ఆలయంలో ప్రవేశించారు ముగ్గురు వ్యక్తులు. ఇద్దరు యువకులతో కలిసి, ఓ అమ్మాయి ఆలయంలోకి చొరబడ్డారు. అది కూడా ఏ రాత్రిపూట అనుకుంటే పొరబాటే. పట్టపగలు ఆలయంలోకి దూరిన ముగ్గురు.. ఆలయంలో ఉన్న ప్రసాదాన్ని తొలుత ఆరగించారు. అనంతరం ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తమను ఎవరూ గమనించడం లేదని.. తమకు వచ్చిన భయమేమీ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఆ యువకులు, యువతి ముందుగా నిర్ణయించుకున్న తమ ప్లాన్ అమలు చేశారు.
ఆలయ ప్రాంగణంలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న ముగ్గురూ.. ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. ఆలయ హుండీలో ఉన్న సొమ్ము మొత్తం చోరీ చేశారు. అయితే మనుషులు ఎవరూ లేరని నిర్ధారించుకున్న ఆ ముగ్గురు దొంగలు.. ఆలయంలో మరో కన్ను తమను గమనిస్తోందనే సంగతి మర్చిపోయారు. ఈ ముగ్గురి వ్యవహారాన్ని ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రికార్డు చేస్తున్నాయనే సంగతిని గమనించుకోలేదు. హుండీలోని సొమ్ము తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ఆ తర్వాత గుడికి వచ్చిన భక్తులు, ఆలయ సిబ్బంది ఈ విషయాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. చోరీ చేసిన ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.