అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాలతో వరుసగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. . అల్యూమినియం, స్టీల్ దిగుమతులపై 25 శాతం మేర సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపించాయి. మరోసారి దేశీయ మార్కెట్లపై దెబ్బ కొట్టాయి. ట్రంప్ వ్యాఖ్యలు సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో సెన్సెక్స్ ఒక దశలో 700 పాయింట్ల మేర నష్టపోయింది. ఇక నిఫ్టీ 50 సూచీ 23,400 దిగువకు చేరుకుంది. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఇవాళ ఒక్కరోజే ఏకంగా రూ.6 లక్షల కోట్ల మేర నష్టపోయి రూ.418 లక్షలకోట్లకు చేరింది.
సోమవారం ఉదయం సెన్సెక్స్ 77,789 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 77,106 పాయింట్ల వద్ద కనిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 548.39 పాయింట్ల నష్టంతో 77,311 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 178 పాయింట్లు కోల్పోయి 23,381 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒక పైసా మేర బలపడి 87.49 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో చూస్తే పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, జొమాటో, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా వంటి షేర్లు మాత్రమే లాభాపడ్డాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 75.36 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
నష్టాలకు అసలు కారణాలు ఇవేనా..
అమెరికా దిగుమతి చేసుకునే స్టీల్, అల్యూమినియంపై 25 శాతం మేర దిగుమతి సుంకాలు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఏయే దేశాలపై సుంకాలు విధిస్తాము, ఎప్పటి నుంచి అమలవుతుంది అనే వివరాలను బహిర్గతం చేయలేదు. ఈ ప్రకటన ప్రభావం మార్కెట్లపై పడింది. అలాగే తమపై సుంకాలు విధించే వారిపై సుంకాలు తప్పవని ట్రంప్ హెచ్చరించడమూ నష్టాలకు కారణమైందని చెప్పవచ్చు. దేశీయ స్టాక్ మార్కెట్లో విదేశీ మదుపరులు అమ్మకాలు చేపట్టడం కొనసాగుతూనే ఉంది. అమెరికన్ డాలర్ బలపడడం, అమెరికా బాండ్ల రాబడులు 4.4 శాతం పైనే ఇస్తుండడం ఇందుకు కారణంగా అనలిస్టులు చెబుతున్నారు.
![]() |
![]() |