నిందితుల రిమాండ్ రిపోర్టులో నెయ్యి కల్తీ జరిగిందని సిట్ చెప్పలేదని టీటీడీ మాజీ ఛైర్మన్, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అయినా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహా ఎల్లో మీడియాలో మాత్రం నెయ్యి కల్తీ జరిగిందని నిర్ధారణ జరిగిపోయినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయన మాట్లాడుతూ.... బోలే బాబా డెయిరీ, వైష్ణవి డెయిరీ, ఏఆర్ డెయిరీ చేసిన తప్పులపై మాత్రమే సిట్ విచారణ జరిపి రిమాండ్ బాధ్యులను రిమాండ్‌కి తరలించింది. సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ డైరెక్టర్ ఆధ్వర్యంలోని సిట్ బృందం ఎక్కడా నెయ్యి కల్తీపై మాట్లాడలేదు. టెండర్ల అవకతవకలపై మాత్రమే విచారణ జరుగుతోంది. దానికి సంబంధించే నలుగురిని అరెస్టు చేశారు.
కానీ, చంద్రబాబు మాత్రం వైయస్ఆర్‌సీపీ మీద నిందలు మోపడానికి లడ్డూ తయారీ కోసం పంది కొవ్వును ఉపయోగించారని ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను కించపరిచారు. పవన్ కళ్యాణ్ మరింత ముందుకెళ్లి సనాతన ధర్మ పరిరక్షణ కోసం తానే ఆవిర్భవించినట్టు వేషం కట్టి బిల్డప్ ఇచ్చాడు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలే పంపారని తీవ్రమైన నిరాధార ఆరోపణలు చేశాడు. నిజానికి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పంపిన లక్ష లడ్డూల తయారీకి కావాల్సిన నెయ్యిని చంద్రబాబు నియమించిన టీటీడీ బోర్డులోనే సభ్యుడిగా ఉన్న ముంబైకి చెందిన సౌరభ్ బోరా అనే వ్యక్తి సరఫరా చేశాడు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే ముందుగా ఆ సౌరభ్ బోరాను అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేసారు.
![]() |
![]() |