మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసారు అని వస్తున్న ఆరోపణలలో తులసిబాబు పాత్ర ఉందని అతని స్నేహితులే వాంగ్మూలం ఇచ్చారని పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. తులసిబాబు బెయిల్ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. పోలీసుల తరఫున న్యాయవాదులు వాదనలను వినిపిస్తూ... ‘నలుగురు వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించి సీఐడీ కార్యాలయంలోకి వచ్చారని డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు వాంగ్మూలం ఇచ్చారు.
నలుగురిలో ఒడ్డు, పొడుగు ఉన్న వ్యక్తి తన గుండెలపై కూర్చున్నారని ఫిర్యాదుదారుడు వాంగ్మూలం ఇచ్చారు. అప్పటి దర్యాప్తు అధికారి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయ్‌పాల్, తులసిబాబు... ఇద్దరినీ కలిపి పోలీసులు విచారించారు. నేర ఘటన నాలుగు గోడల మధ్య జరిగింది. ఈ నేపథ్యంలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారిపై ఉంటుంది. విచారణ సందర్భంగా నోరు తెరవకుండా ఉంటామంటే కుదరదు. తులసిబాబు 2020 అక్టోబరు 6న సీఐడీ లీగల్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. హైకోర్టులో సీఐడీ కేసులు ట్రయల్ కోసం తులసిబాబును నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటికి తులసిబాబు న్యాయవాది కూడా కాదు. తులసిబాబు 2021, నవంబరు 16న ఏపీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదయ్యారు. న్యాయవాదిగా ఎన్‌రోల్ అయిన మూడు నెలల్లోనే 12 కేసుల్లో సహకారం అందించినందుకుగాను ఆయనకు సీఐడీ రూ.48 లక్షలు చెల్లించింది. రఘురామను చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారంలో పిటిషనర్ పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయి. రఘురామపై పిటిషనర్‌తోపాటు మరో ముగ్గురు దాడి చేశారు అని తెలిపారు.