సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్‌పై సీఐడీ విచారణ మొదలైంది. ఆయన సీఐడీ అధికారిగా ఉన్న సమయంలో పలువురిని అర్ధరాత్రి అరెస్టు చేయడమే కాకుండా థర్డ్‌డిగ్రీ ప్రయోగించారంటూ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదుపై విచారణ మొదలైంది. మంగళవారమిక్కడ న్యాయస్థానాల ప్రాంగణంలో లక్ష్మీనారాయణ వాంగ్మూలాన్ని సీఐడీ అధికారులు నమోదు చేశారు. అనంతరం టీడీపీ మీడియా సెల్ ఇన్‌చార్జి దారపనేని నరేంద్ర, టీడీపీ సోషల్ మీడియా నేత గార్లపాటి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేశ్, సీనియర్ జర్నలిస్టు కొల్లి అంకబాబు నుంచీ వాంగ్మూలం తీసుకున్నారు.
సీఐడీ డీజీగా సునీల్‌కుమార్ ఉన్నకాలంలో పలువురు టీడీపీ కార్యకర్తలను అర్ధరాత్రి అరెస్టు చేయడమే కాకుండా నిబంధనలను అతిక్రమించి కస్టడీలో వారిపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారని లక్ష్మీనారాయణ అప్పట్లో కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం కార్యదర్శి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. దీనిపై విచారణ జరపాలని సీఎస్ డీజీపీని కోరినా.. జగన్ హయాంలో పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ వ్యవహారంలో విచారణ చేపట్టాలని లక్ష్మీనారాయణ మళ్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం సునీల్‌కుమార్‌పై విచారణకు ఆదేశించింది. సీఐడీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం లక్ష్మీనారాయణ వద్దకు వెళ్లారు. తాను ఈ ఫిర్యాదు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన వివరించారు. విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబును అర్ధరాత్రి అరెస్టు చేయడమే కాకుండా.. కనీసం ఆయన వయసుకు గౌరవం కూడా ఇవ్వలేదని తెలిపారు.
![]() |
![]() |