కేరళలోని ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో సాగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి దాష్టీకం బయటపడింది. కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో మొదటి ఏడాది విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో హింసించిన ఐదుగురు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువనంతపురానికి చెందిన జూనియర్ విద్యార్థులు కొట్టాయం గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత నవంబరు నుంచి సీనియర్ల తమను చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు. బలవంతంగా బట్టలు విప్పదీయించి, మర్మాంగాలకు డంబెల్స్ కట్టి వికృత ఆనందం పొందారని కన్నీళ్లు పెట్టుకున్నారు.
వారి క్రూరత్వం అక్కడితో ఆగలేదు. జామెట్రీ బాక్సులో కాంపాస్ సహా పదునైన వస్తువులతోనూ రక్తం వచ్చేలా గుచ్చి ఆయ గాయాలకు లోషన్ రాసి హింసించారు. బాధితులు బాధతో కేకలు వేస్తుంటే, లోషన్‌ను బలవంతంగా వారి నోటిలోకి పూసేవారు. ఈ దుశ్చర్యలను వీడియో తీసి, ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. ప్రతి ఆదివారం మద్యం పార్టీల కోసం జూనియర్ల నుంచి డబ్బులు లాక్కునేవారు. ఎవరైనా ఎదురుతిరిగితే దారుణంగా కొట్టేవారు. వారి ఆగడాలను తట్టుకోలేకపోయిన ఓ విద్యార్థి తన తండ్రికి చెప్పడంతో ఆయన సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మూడు నెలల పాటు వాటి ఆగడాలను మౌనంగా భరించిన విద్యార్థులు.. శ్రుతిమించడంతో చివరకు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో యాంటీ ర్యాగింగ్ చట్టం కింద కేసు నమోదుచేసి.. ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న నిందితులు.. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. కొద్ది వారాల కిందట 15 ఏళ్ల బాలుడు మిహిర్ అహ్మద్.. తోటి విద్యార్థుల ర్యాగింగ్ కారణంగా 26 అంతస్తులు ఎత్తైన భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కేరళలో సంచలనం రేపింది. అది జరిగిన కొద్ది రోజుల్లోనే ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హం.
![]() |
![]() |