ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో దీని తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వైరస్ కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 50లక్షలకు పైగా కోళ్లు మృతిచెందినట్లు సమాచారం. బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం, అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఏపీలో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. అటు కస్టమర్లు రాకపోవడంతో చికెన్ సెంటర్లు బోసి పోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ప్రమాదం ఏమీలేదని ఆయన స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియా, కొన్ని పత్రికలు భయాందోళనలు సృష్టిస్తున్నాయని, అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం, శాస్త్రవేత్తలతో చర్చించామని చెప్పిన మంత్రి.. కోళ్లకు వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కిలోమీటర్ వరకే ఇది పరిమితం అవుతుందని చెప్పినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.
![]() |
![]() |