ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే పాలన సాగుతోందని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్ మండిపడ్డారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై రాజకీయ కక్షసాధింపులకే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికార దుర్వినియోగంతో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ..... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోంతోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమ కేసులో ఇరికించి పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల కిందట సత్యవర్థన్ ఎస్సీ, ఎస్టీ జడ్జీ ముందు హాజరై తనతో బలవంతంగా పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో వల్లభనేని వంశీ పేరును చెప్పించి ఫిర్యాదు చేయించారంటూ వాగ్మూలం ఇచ్చారు. దీనితో ఈ కేసు పూర్తిగా నీరుగారింది. వెంటనే సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కక్షపూరితంగా సత్యవర్థన్ ఇంటికి టీడీపీ నేతలను పంపి ఆయన కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురి చేసి వారితో మళ్ళీ వల్లభనేని వంశీపై ఫిర్యాదు చేయించారు. ఇటువంటి దుర్మార్గమైన విధానాలకు ప్రభుత్వంలోని పెద్దలే పాల్పడుతుంటే ఈ రాష్ట్రంలో ఎవరికైనా న్యాయం జరుగుతుందా? ఎన్నికల వాగ్ధానాలను ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఈ రకమైన తప్పుడు కేసులను బనాయిస్తున్నారు. దీనికి వల్లభనేని వంశీపై బనాయించిన కేసే ఒక నిదర్శనం అని తెలియజేసారు.
![]() |
![]() |