ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాళ్లిద్ద‌రూ టిడిపి రెబ‌ల్స్‌గాఖాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 12:34 AM

జగ్గంపేట అసెంబ్లీ టీడీపీ టిక్కెట్టు తన భార్య వాణికి ఇవ్వాలని కాకినాడ ఎంపీ తోట నర్సింహం.. పెద్దాపురం అసెంబ్లీ టిక్కెట్టు తనకివ్వాలని బొడ్డు భాస్కరరామారావు పట్టుబడుతున్నారు. ఈ రెండూ జరిగే పనులు కాదని టీడీపీ అధిష్ఠానం తేల్చేసింది. అయినా ఈ ఇద్దరు నాయకులు పార్టీ అధినేత చంద్రబాబు తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. మంగళవారం తన నిర్ణయం చెబుతానని సీఎం చంద్రబాబు నుంచి నర్సింహం, బొడ్డు భాస్కర రామారావులకు వర్తమానం అందినట్టు సమాచారం. కాకినాడ ఎంపీగా ఉన్న తోట నర్సింహం తన అనారోగ్య కారణంగా పోటీ నుంచి వైదొలుగుతున్నానని, తన భార్య వాణికి జగ్గంపేట టిక్కెట్టు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ వారం కిందట సీఎం చంద్రబాబుని కలిశారు. జగ్గంపేట సీటు నెహ్రూకి ఖాయం చేసిన చంద్రబాబు నర్సింహం భార్యకు సీటు విషయంలో హామీ ఇవ్వలేదు. అలా అని ఖరాఖండీగా తోసిపుచ్చనూ లేదు. జగ్గంపేట సీటు డిమాండు చేస్తే ఏదొక అసెంబ్లీ సీటు వస్తుందన్న అభిప్రాయంతో నర్సింహం లౌక్యంగా వ్యవహరించారన్న వాదన వినిపిస్తోంది. తమ విజ్ఞప్తిని తిరస్కరిస్తే పార్టీ మారాలన్న యోచనలో నర్సింహం కుటుంబం ఉంది.


నెహ్రూకి సీటు ఖాయం చేశారని తెలిసినా నర్సింహం ఇంకా టీడీపీ నేతలతో టచ్‌లోనే ఉన్నారు. ప్రత్యామ్నాయంగా మరో అవకాశం ఉంటుందనే అభిప్రాయం ఆయన అనుచరగణం భావిస్తోంది. మరోవైపు జగ్గంపేట నుంచి పోటీ ఖాయమని నర్సింహం ఇప్పటికే ప్రకటించారు. అంటే ఏదో పార్టీ నుంచి టిక్కెట్టు హామీ లభించిందా? లేదా స్వతంత్ర అభ్యర్థినిగా వాణిని పోటీకి నిలుపుతారా? అనేది తేలాల్సి ఉంది. అయితే ఇదే దశలో తోట నర్సింహంను ఇటీవల జనసేన నాయకులు కలిశారు. తమ పార్టీలోకి వస్తే జగ్గంపేట సీటు విషయం మాట్లాడదామని ప్రతిపాదన పెట్టారు. మరోవైపు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఇంతకుముందే కలవగా, తాజాగా సోమవారం కాకినాడ వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కలిశారు. వీరిద్దరి మధ్య చాలాసేపు చర్చలు సాగాయి. మొత్తానికి ఏ నిర్ణయం తీసుకునేదీ మంగళవారం తేలిపోనుంది.


బొడ్డు ప్రతిపాదనలు పక్కకు...


పెద్దాపురం అసెంబ్లీ సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న హోంమంత్రి చినరాజప్పకు రాజమహేంద్రవరం రూరల్‌ సీటు ఇచ్చి.. బుచ్చయ్య చౌదరికి ఎంపీ టిక్కెట్టు ఇస్తే బాగుంటుందని బొడ్డు భాస్కరరామారావు టీడీపీ అధిష్ఠానానికి కొత్త ప్రతిపాదన చేశారు. దీన్ని చంద్రబాబు తిరస్కరించారు. దీంతో భాస్కర రామారావు ఈనెల 6 వరకు వేచిచూడాలని నిర్ణయించుకున్నారు. ఈలోగా పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో తన వర్గంతో సమాలోచనలు చేస్తున్నారు. పెద్దాపురం నుంచి స్వతంత్రంగా బరిలోకి దిగాలా? లేదా జనసేన, వైసీపీల్లో ఏదో ఒక పార్టీ నుంచి టిక్కెట్టు తెచ్చుకుని పోటీ చేయాలా? అనేదానిపై తర్జనభర్జన జరుగుతోంది. బొడ్డు భాస్కరరామారావు పెద్దాపురంలోనూ, తోట నర్సింహం సతీమణి వాణి జగ్గంపేట నుంచీ రెబల్స్‌గానో, ప్రత్యర్థి పార్టీల నుంచో అభ్యర్థులుగా దిగినా టీడీపీని ఢీకొట్టలేరని హోంమంత్రి చినరాజప్ప, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ధీమాగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa