రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తెలుగుదేశం పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. అమలాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన పార్టీ శ్రేణులతో మంగళవారం ఆ పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో సమీక్ష జరగనుంది. జిల్లాలో టీడీపీ సిటింగ్‌లకే ఆ పార్టీ అధిష్ఠానం అగ్రతాంబూలం కల్పించడంతో అమలాపురం రిజర్వుడులోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో ఒకటి రెండు మినహా మిగిలిన స్థానాల్లో సిట్టింగ్‌లకే అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అమలాపురం రిజర్వుడు లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిత్వానికి దివంగత నేత, మాజీ లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు హరీ్‌షమాధూర్ పేరును ఖరారుచేసేందుకు పార్టీ సుముఖంగా ఉన్నట్టు సమాచారం.
తండ్రి బాలయోగికి ఉన్న పేరు ప్రతిష్టలతోపాటు యువకుడైన హరీ్‌షమాధూర్ నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నందున అతని వైపు మొగ్గుచూపుతున్నారు. ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల విషయానికొస్తే ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబే తిరిగి పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకునే అవకాశమున్నట్టు సమాచారం. అమలాపురం రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిటింగ్ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతోపాటు మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి, ఇతర పార్టీ నాయకులు సీటుకోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో పార్టీ నాయకులు రెండుగా చీలిపోయారు. మెట్ల వర్గం అయితాబత్తుల ఆనందరావుకే తమ మద్దతును పలుకుతుండగా, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆనందరావు రాజకీయ భవితవ్యంపై మంగళవారం జరిగే సమావేశంలో కీలక నిర్ణయం వెలువడుతుందని ఆయన వర్గీయులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్లీ గొల్లపల్లి సూర్యారావే పోటీలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు సూర్యారావు తన పేరును ఎంపీ స్థానానికి ప్రతిపాదించాలని పార్టీ పెద్దలపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. అయితే ఎంపీ అభ్యర్థిత్వం దక్కే అవకాశాలు సన్నగిల్లడంతో రాజోలు నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీ పెద్దలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎంపీగా సూర్యారావు వెళితే ఆయన స్థానంలో గేదెల వరలక్ష్మి, బత్తుల రాము పేర్లను పార్టీ పరిశీలనకు తీసుకునే అవకాశముంది. గన్నవరం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తికే మళ్లీ టిక్కెట్ ఇవ్వాలని కోరుతూ సోమవారం గన్నవరంలో జరిగిన ఆ పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశం తీర్మానించింది. బయట వ్యక్తులను తాము అంగీకరించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. సమన్వయకమిటీని ప్రసన్నంచేసుకోవడం ద్వారా మళ్లీ టిక్కెట్ తనదేనంటూ నారాయణమూర్తి ఇప్పటికే నియోజకవర్గంలో హల్‌చల్ చేస్తున్నారు.
అయితే ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, ఎస్సీఎస్టీ మోనటరింగ్ కమిటీ సభ్యుడు నేలపూడి స్టాలిన్‌బాబు పేర్లను పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తుంది. స్టాలిన్‌కే టిక్కెట్ అంటూ ఆయన వర్గీయులు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. కొత్తపేట నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేరు దాదాపు ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గంలో అన్నివర్గాల మద్దతును కూడగట్టుకోవడంలో ఆయన ముందంజలో ఉన్నారు. మండపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వేగుళ్ల జోగేశ్వరరావు పేరును పార్టీ అధిష్ఠానం లాంఛనంగా ప్రకటించనుంది. ఇక రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తాను టీడీపీలోనే కొనసాగుతానని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేయడంతో ఆ స్థానం నుంచి త్రిమూర్తులు పేరును ఖరారుచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.