ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఈ క్రమంలోనే మహిళలకు దీపం 2.O పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. గతేడాది అక్టోబర్ 31న ఉచిత సిలిండర్ల పథకం ప్రారంభంకాగా.. మహిళలకు డబ్బుల్ని ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 98 శాతం మందికిపైగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్‌లలో డబ్బులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. దీపం పథకం లబ్ధిదారులు ఒకసారి అకౌంట్ చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లబ్ధిదారులకు ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1967ని సంప్రదించవచ్చు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ/వార్డు సచివాలయాల్లో, తహసీల్దారు కార్యాలయాల్లో పౌర సరఫరాల అధికారుల్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.
దీపం పథకం డబ్బులు బ్యాంకు అకౌంట్లలో జమ చేసినా.. గతంలో మొబైల్ నంబర్లు అకౌంట్‌లకు లింక్ కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత లింక్ కావడంతో ఇబ్బంది లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా 98శాతంమందికి డబ్బులు అకౌంట్‌లలో జమ చేశారు. మిగిలిన 2శాతం లబ్ధిదారులకు వివిధ కారణాలతో డబ్బులు జమ కాలేదని చెబుతున్నారు. దీపం పథకం కింద లబ్ధిదారులు రూ.840 చెల్లించి సిలిండర్ బుక్ చేసుకుంటే ఆ డబ్బుల్ని ప్రభుత్వం తిరిగి వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తోంది. ఇందులో కేంద్రం రూ.20 చొప్పున రాయితీ ఇస్తోంది.. మిగిలిన రూ.820 ఏపీ ప్రభుత్వం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ మొదటి సిలిండర్ బుక్ చేసుకోని వారు మార్చి 31వ తేదీలోగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు అధికారులు.
రాష్ట్రంలో మొత్తం 1.54 కోట్ల డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి.. వీటిలో 1.08 కోట్ల కనెక్షన్లు ఉచిత సిలిండర్ పథకానికి అర్హులు. రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నా.. ఆధార్ సమర్పించకపోవడంతో దీపం పథకానికి అర్హత పొందలేకపోయారు. గ్యాస్ కనెక్షన్‌తో ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకున్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం తెలిపింది. దీపం పథకంలో మూడు ఉచిత సిలిండర్లు పొందాలంటే ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి.. కనెక్షన్ కుటుంబంలో ఎవరి పేరుతోననైనా ఉండొచ్చు.. అయితే రేషన్ కార్డులో లబ్ధిదారుడి పేరు ఉండాలి.
ఒకవేళ భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్నా దీపం పథకానికి అర్హులే. ఒక రేషన్ కార్డులో కుటుంబసభ్యుల పేరుతో రెండుకు మించి గ్యాస్ కనెక్షన్లు ఉన్నా ఒక్కదానికే రాయితీ వర్తిస్తుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన దీపం కనెక్షన్లకు రాయితీ ఇస్తారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల రాయితీ డబ్బులు జమ కావాలంటే కచ్చితంగా అకౌంట్ ఈకేవైసీ పూర్తి చేయాలి. ఆన్‌లైన్, డీలర్ దగ్గర ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. సిలిండర్ తీసుకున్న 48 గంటల్లోనే గ్యాస్ సంస్థలు రాయితీ డబ్బుల్ని లబ్ధిదారుల అకౌంట్‌లకు జమ చేస్తాయి.
![]() |
![]() |