ప్రేమించాలని, తనకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండాలంటూ.. ఓ విద్యార్థినిని ఓ ఉపాధ్యాయుడు తీవ్ర ఇబ్బంది పెట్టాడు. స్కూల్ ప్రిన్సిపల్‌కు చెప్పగా.. ఆ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. అయినా ఆ టీచర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తీవ్రంగా విసిగిపోయిన ఆ విద్యార్థిని.. జరిగిన విషయం మొత్తాన్ని గ్రామస్తులకు చెప్పడంతో వాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్‌లోని కిసాన్‌గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కిసాన్ హైస్కూల్‌లో పనిచేసే ఉపాధ్యాయుడు వికాస్ కుమార్.. గత కొన్నిరోజులుగా అదే స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న ఓ యువతిని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమె ఫోన్ నంబర్ తీసుకుని మాట్లాడటం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలోనే తనకు ప్రియురాలిగా ఉండాలని పేర్కొన్నాడు. అంతటితో ఆగకుండా మహాభారతంలోని ఏకలవ్యుడి కథను చెప్పాడు. ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు తన బొటనవేలును ఇచ్చి గురుదక్షిణ చెల్లించాడని తెలిపిన వికాస్ కుమార్.. తాను గురువును అని గురుదక్షిణ చెల్లించుకోవాలని కోరాడు. ఈ క్రమంలోనే ఆ విద్యార్థినికి వికాస్ కుమార్ పలుమార్లు ప్రపోజ్ చేశాడు. ఇద్దరం కలిసి సిలిగురికి వెళ్లి.. ఎంజాయ్ చేద్దామని చెప్పాడు.
వికాస్ కుమార్ వేధింపులు తట్టుకోలేని ఆ విద్యార్థిని.. స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వికాస్ కుమార్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. ఆమె విసుగుచెందింది. దీంతో ఆ విషయం కాస్తా ఆ గ్రామస్తులకు తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆ స్కూల్ వద్ద ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ నేపథ్యంలోనే చివరికి జిల్లా కలెక్టర్ స్పందించడంతో గ్రామస్తులు శాంతించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి వికాస్ కుమార్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా వికాస్ కుమార్.. గతంలో అదే స్కూల్‌లో పని చేసిన మహిళా టీచర్‌కు ప్రపోజ్ చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు.
![]() |
![]() |