ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింహాచలం పరిధిలోని పంచగ్రామాల సమస్యకు పరిష్కారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 01:04 AM

విశాఖపట్నం పరిధిలోని పంచగ్రామాల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించింది. దశాబ్దాలుగా సింహాచలం దేవస్థానం భూముల్లో నివాసం ఏర్పరుచుకొని.... నివాసముంటున్న ప్రజలకు ఆ భూముల పై హక్కు కల్పించేందుకు విధి విధానాలు రూపొందించి క్యాబినెట్ కు పంపించాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. 100 గజాల లోపు స్థలంలో నివాసాలు ఏర్పరుచుకొని దారిద్రరేఖ దిగువున వున్న కుటుంబాలకు ఉచితంగా స్థలాన్ని క్రమబద్దీకరించాలని నిర్ణయించారు. వంద గజాల పైబడిన నివాస స్థలాలకు శ్లాబుల వారీగా రేటు నిర్ణయించారు. సచివాలయం వేదికగా ఉపముఖ్యమంత్రిగారి నేత్రుత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశంలో ఉపముఖ్యమంత్రి కే.ఈ. క్రిష్ణమూర్తి తో పాటు ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామక్రిష్ణుడు, రవాణాశాఖామంత్రి అచ్చెన్నాయిడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు, రెవెన్యూ మరియు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్థానిక ప్రజల నుంచి వచ్చిన విజ్ణప్తి మేరకు సమస్యను పరిష్కరించేందుకు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. ప్రభత్వం తీసుకున్న నిర్ణయం వల్ల  ఈ ఐదు గ్రామాలలో నివసించే వేలాదిమంది నివాసితుల సమస్యకు శాశ్వత పరిష్కారం  దొరకడం తో పాటు దేవస్థానానికి ప్రయొజనం చేకూరింది. ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చే క్రమంలో దేవస్థానం సంపద కాపాడడంలో రాజీపడకుండా దేవాదాయ భూమికి ప్రత్యామ్నాయంగా 547 ఎకరాల 13 సెంట్ల ప్రభుత్వ భూమిని దేవస్థానానికి అప్పగించాలని నిర్ణయించింది. అయితే నివాస స్థలాల క్రమబద్దీకరణకు కొంత మొత్తం కట్టించకపోతే దేవస్థానం నష్టపోతుందని దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకొచ్చారు. సమస్యకు పరిష్కార మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వం క్రమబద్దీకరణ వ్యవహారాన్ని మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించింది. 

భూముల క్రమబద్దీకరించేందుకు ప్రజల నుంచి  ఎంత మొత్తం కట్టించుకోవాలనే విషయం పై  మంత్రివర్గ ఉపసంఘం సుధీర్ఘంగా చర్చించింది.  పేద, మధ్యతరగతి ప్రజల ను ద్రుష్టిలో పెట్టుకొని దారిద్ర్యరేఖకు దిగువున వున్న పేదలకు 100 గజాలకు ఉచితంగా క్రమబద్దీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. అలాగే 101 నుంచి 200 గజాల వరకు బిపిఎల్ కుటుంబాలకు 1998 రిజిస్ట్రేషన్ వ్యాల్యూ లో 7.5 శాతం  చెల్లిస్తే సరిపోతుంది. అలాగే  1 నుంచి 200 గజాల వరకు  దారిద్ర్యరేఖకు ఎగువున ఉన్న కుటుంబాలకు 1998 రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 7.5 శాతం  చెల్లిస్తే సరిపోతుంది. 201 నుంచి 300 వరకు 15 శాతం, 301 నుంచి 500 వరకు 1998 రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 30 శాతం చెల్లిస్తే స్థలాలను క్రమబద్దీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. 500 గజాలు దాటితే ఆక్షన్ లో పాల్గొని స్థలాన్ని పొందాల్సి వుంటుందని  నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సంఘం సూచించిన విధంగా భూముల క్రమబద్దీకరణకు విధివిధానాలు రూపొందించి క్యాబినెట్ కు పంపించాలని  అధికారులను ఆదేశించారు. 

పంచ గ్రామాలలో వున్న  దేవాదాయ భూములు ఆక్రమించుకొని, దేవస్థానం రికార్డులలో ఇళ్ళు లేదా ఇంటి స్థలము యొక్క అనుభవదారునిగా 2008 వ సంవత్సరం  నమోదై వుంటే అలాంటి వారు క్రమబద్దీకరణకు అర్హులు. విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మరియు చినగధిలి మండలాల్లోని  పంచ గ్రామాలుగా పేరొందిన అడవివరం, వెంకటాపురం, వేపగుంట, పురుషోత్తపురం మరియు చీమలాపల్లి ఈ 5 గ్రామాలు  పూర్తి ఇనాం గ్రామాలు. వీటిని విజయనగరం ఎస్టేట్  మహారాజులు  సింహాచలం వరాహలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానమునకు దానం చేసి... 11వేల 288 ఎకరాలు 26 సెంట్ల భూ సంపదను   సమకూర్చారు. 1956 ఇనామ్ రద్దు చట్టం వచ్చిన తరువాత ఈ ఐదు ఈనాం గ్రామాలను  రైత్వారీ గ్రామాలుగా మార్పుచేయడం జరిగినది. 5 దశాబ్దాలుగా సింహాచలం దేవస్థానం భూముల పరిష్కార విచారణ మరియు ఈనాం విచారణ పెండింగ్ లో ఉండడంతో.... ఈ భూముల ఆక్రమణ మరియు అనుభవంలో ఉన్నటువంటి  చాలా మంది ప్రజలు వ్యవసాయ భూములను......వ్యవసాయేతర భూములుగా మార్చుకొన్నారు. లేఅవుట్లు వేసి ఇతరులకు విక్రయించారు. రిజిస్ట్రేషన్ సవరణ చట్టం 4/1999 విభాగం 22(A) వచ్చు వరకు ఈ భూములు ఇతరులకు విక్రయించడంలో ఏవిధమైన నిషేధములు లేదు. అలాగే దేవస్థానమునకు 1996- 1997  సంవత్సరంలో ఇనామ్ సెటిల్మెంట్ హక్కులు  వచ్చే వరకు దేవస్ధానం వారు ఈ స్థలములో నిర్మాణాలను నిలువరించలేకపోయారు. చాలా మంది సామాన్య ప్రజలు ఈ భూములలో పక్కా ఇళ్లను నిర్మించుకొన్నారు.

భూసంస్కరణలు అంటే 1956 ఆంధ్రప్రదేశ్ ఇనామ్ రద్దు మరియు రైత్వారీలోనికి మార్పిడి చట్టం మేరకు 9 వేల 69 ఎకరాల 22 సెంట్లను దేవస్థానం భూమిగా గుర్తించి సింహాచలం దేవస్థానానికి 1996-97 సంవత్సరంలో రైత్వారీ పట్టా ఇచ్చియున్నారు. మిగిలిన భూమి ప్రభుత్వ భూమి అనగా (రోడ్లు, గ్రామకంఠం, శ్మశానాలు, చెరువులు) వున్నాయి.      రైత్వారీ పట్టా జారీకి ముందే  దశాబ్దాల కాలం నుండి పంచగ్రామాల పరిధిలో  420 ఎకరముల దేవస్థానం భూమిలో ఆక్రమణలు జరిగియున్నవి. ఈ 420 ఎకరాల ఆక్రమిత భూముల్లో 12 వేల 400 మంది పైగా భూమిలో గ్రుహాలు నిర్మించుకొని  దశాబ్దాలు తరబడి నివసిస్తున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa