ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెచ్‌ఐవీ పై విజయం దిశగా అడుగులు

international |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2019, 01:47 AM

 


ఒకసారి సోకితే నయంకాని భయంకరమైన వ్యాధి హ్యూమన్‌ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్‌(హెచ్‌ఐవీ). అలాంటిది లండన్‌కు చెందిన ఒక వ్యక్తికి పూర్తిగా నయం కావడం సంచలనం కలిగించింది. అతని శరీరంలో ఆ వ్యాధికి సంబంధించిన వైరస్‌ జాడే లేదు. 2003లో హెచ్‌ఐవీ సోకిన వ్యక్తికి 2012లో హాడ్కిన్స్ లింఫోమా అనే బ్లడ్‌ క్యాన్సర్‌ సోకింది. 2016 నాటికి అది బాగా ముదిరిపోయింది. ఆ సమయంలో జన్యుపోలికలు ఉన్న వ్యక్తి నుంచి ఎముక మజ్జ మార్పిడి చేశారు. అప్పటి నుంచి 18 నెలలపాటు అతనికి యాంటీ రెట్రో వైరల్‌ మందులు ఇస్తూ వచ్చారు. శస్త్రచికిత్స జరిగిన 3 సంవత్సరాలు గడిచాక చూస్తే అంతకు ముందు అతని శరీరంలో ఉన్న హెచ్‌ఐవీ జాడ ఎక్కడా కనిపించలేదని అతనికి వైద్యం అందిస్తున్న వైద్యుల బృందానికి నేతృత్వం వహిస్తున్న రవీంద్ర గుప్తా తెలిపారు. ఇలా హెచ్‌ఐవీ పూర్తిగా నయమైన వారిలో మొదటి వ్యక్తి తిమోతీ బ్రౌన్‌. ఆయన అమెరికాకు చెందినవాడు. 2007లో జర్మనీలో ఇదే తరహా వైద్యం చేయించుకున్న ఆయనకు కొంత కాలానికి ఈ వైరస్‌ నుంచి విముక్తి లభించింది. వ్యాధి సోకిన వారందరికీ ఈ తరహా వైద్యం చేయడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారమని నిపుణులు అంటున్నారు. అందులోనూ జన్యుపోలికలు ఉన్న వ్యక్తులు దొరకడం సాధారణమైన విషయం కాదంటున్నారు. ఈ విధానంతో వైరస్‌ నయమైనా అందరికీ ఇదే విధానాన్ని అనుసరించలేమని, కొత్త పరిశోధనల వైపు వెళ్లాలని వారు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏదో ఒకరోజు మన శాస్త్రవేత్తలు కచ్చితంగా ఈ వ్యాధికి మందు కనిపెట్టగలరనే నమ్మకం బలపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 37 మిలియన్ల మంది ఈ వ్యాధిగ్రస్థులున్నారు. 1980లో ఈ వైరస్‌ మొదటిసారి బయటపడినప్పటి నుంచి నేటికి దాదాపు 35 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa