తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా వుండేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. సమ్మర్ క్రాష్ ప్రోగ్రామ్ కింద బోర్లు, రక్షిత తాగునీటి పథకాలకు మరమ్మతులు చేస్తున్నారు. వచ్చే నెల 15వ తేదీలోగా ఈ పనులన్నీ పూర్తిచేసేలా కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు.గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అధికారు రికార్డుల ప్రకారం అనకాపల్లి జిల్లాలో 16,059 చేతి బోర్లు, 1,850 పీడబ్ల్యూఎస్‌పైపుల ద్వారా నీటిని సరఫరా చేసే (పీడబ్ల్యూఎస్) పథకాలు, 28 సమగ్ర రక్షిత తాగునీటి (సీపీడబ్ల్యూ) పథకాలు వున్నాయి. వేసవిలో తాగునీటి కొరత ఏర్పడకుండా చూడాలని, ఈ నెల ఒకటో తేదీ నుంచి సమ్మర్ క్రాష్ ప్రోగ్రామ్‌ను అమలు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ గత నెలలో ఆదేశాలు జారీ చేశారు.
దీంతో ఎంపీడీఓల పర్యవేక్షణలో అన్ని గ్రామాల్లో ప్రత్యేక బృందాలు పర్యటించి తాగునీటి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. తాగునీటి బోర్లు పనిచేస్తున్నాయా? లేదా? అన్నది పరిశీలిస్తున్నారు. ఒకవేళ బోరు పనిచేయకపోతే సమస్య ఏమిటో గుర్తిస్తున్నారు. పూడిక పేరుకుపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల నీరు రాకపోతే బోరుకు ఫ్లష్ చేయించి, మరింత లోతు తవ్విస్తున్నారు. పైపులు తుప్పుపడితే వాటిని మారుస్తున్నారు. ఇంకేమైనా మరమ్మతులు వుంటే పూర్తిచేసి బోరు నుంచి నీరు వచ్చేలా చర్యలు చేపడతున్నారు. రక్షిత ట్యాంకులను పరిశీలించి, అవసరమైతే మరమ్మతు పనులు చేస్తున్నారు. తుప్పు పట్టిన, విరిగిన పైపుల స్థానంలో కొత్తవాటిని అమర్చుతున్నారు. జిల్లా అధికారులు ఆదేశించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సమ్మర్ క్రాష్ ప్రోగ్రామ్ కింద మరమ్మతు పనులన్నీ వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని మండలస్థాయి అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
![]() |
![]() |