పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోదీకి చెందిన బంగ్లాను డైనమైట్ మెట్టి కూల్చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. దీని పునాది చాలా పటిష్ఠంగా ఉండటంతో కొద్ది రోజులుగా దీన్ని కూల్చలేకపోతున్నారు. ప్రస్తుతం బంగ్లా చుట్టుపక్కలా ఉన్న చిన్న చిన్న గదులను నేలమట్టం చేసేపనిలో ఉన్నారు. అలీబాగ్ ప్రాంతంలో సుమారు 33,000చదరపు అడుగల స్థలంలో ఈ బంగ్లాను నిర్మించారు. అత్యంత విలాసవంతంగా ఉన్న ఈ భవనాన్ని అక్రమంగా, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని అధికారులు తెలిపారు. ఈ బంగ్లా విలువ రూ.100కోట్లు పైమాటే.
ఈ బంగ్లాను కూల్చేయడానికి గత ఆరు వారాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే పెద్ద పెద్ద యంత్రాలు తెచ్చి ప్రహరీ, మెయిన్ గేట్లను తొలగిస్తున్నారు. పునాది అత్యంత పటిష్ఠంగా ఉండటంతో బంగ్లా కూల్చివేత కష్టంగా మారింది. దీంతో డైనమైట్ ఉపయోగించి దీన్ని కూల్చాలని అధికారులు నిర్ణయించారు.
దీనిపై రాయ్‌గఢ్ అదనపు కలెక్టర్ భరత్ షితోలే మాట్లాడుతూ..'భవనాన్ని డైనమైట్ పెట్టి కూల్చేసేందుకు ఇప్పటికే రంధ్రాలు పెట్టాం. వాటిల్లో డైనమైట్‌ను అమర్చి శుక్రవారం దీన్ని పేల్చేయడానికి మాకు ఆదేశాలు అందాయి. రిమోట్ కంట్రోల్ సాయంతో దీన్ని ఆపరేట్ చేస్తాం. దీని వల్ల ఎటువంటి నష్టం కలగకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నాం' అని తెలిపారు.
ఈ భవన నిర్మాణానికి అత్యంత నాణ్యమైన లోహాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ బంగ్లాలో ఒక స్విమ్మింగ్ పూల్, రిసార్టులు, విలువైన ఫిట్టింగులు ఉన్నాయి. ముంబయికి 90కి.మీదూరంలో కిహీమ్ బీచ్ సమీపంలో సముద్ర ముఖంగా ఈ బంగ్లా ఉంది. బంగ్లా లోపల అత్యంత పటిష్ఠంగా భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ దీన్ని అక్రమంగా నిర్మించారు. బీచ్ సమీపాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చేయాలన్న బాంబే హైకోర్టు ఆదేశాలనుసారం దీన్ని పడగొడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa