అమెరికా సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ శనివారం పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించాలని వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో మంగళవారం పిలుపిచ్చారు. 'అమెరికా జాతీయ భద్రతకు అసాధారణ ముప్పుగా వెనిజులా పరిణమించిందని'' ముద్ర వేస్తూ 2015 మార్చి 9న అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకాలు చేశారని, అత్యవసర పరిస్థితి ప్రకటించారని అందువల్ల తాను ప్రదర్శనలు చేపట్టడానికి అదే తేదీని ఎంచుకున్నానని మదురో చెప్పారు. ఆ రోజును వెనిజులా సామ్రాజ్యవాద వ్యతిరేక దినంగా ప్రకటించామని, నిరసన తెలియచేస్తూ వీధుల్లోకి రావాలని మదురో మద్దతుదారులకు పిలుపిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా అదే రోజు అయినందున ర్యాలీ సందర్భంగా ముఖ్యమైన ప్రకటనలు చేస్తానని మదురో ప్రకటించారు. 2013 మార్చి 5న మరణించిన మాజీ అధ్యక్షుడు, సంస్కరణవాది అయిన హ్యుగో ఛావెజ్ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మదురో మాట్లాడారు. ప్రభుత్వ నిషేధం వున్నప్పటికీ దేశ సరిహద్దుల ద్వారా అమెరికా సహాయ బృందాలను పంపాలంటూ గత నెల 23న ప్రతిపక్షం చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టిన సైనికులను అభినందించారు. వెనిజులాలోకి చొరబడేందుకు సాయం పేరుతో అమెరికా చేసిన చొరబాట్లే ఇవని మదురో విమర్శించారు. ఈ విజయం సాధించిన సైనిక నేతలను అభినందిస్తున్నట్లు తెలిపారు. వెనిజులా ప్రస్తుతం దురాక్రమణను ఎదుర్కొంటోందని మదురో పేర్కొన్నారు.
చర్చల ద్వారా పరిష్కరించుకుందాం-
వెనిజులా ప్రతిపక్ష నేత జువాన్ గెయిడో సోమవారం స్వదేశానికి తిరిగి వచ్చినందున దేశంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు చర్చలు, సంప్రదింపులే ఉత్తమమైన మార్గమని ప్రజలు భావిస్తున్నారు. దాదాపు వారం రోజుల పాటు విదేశాల్లో గడిపి వచ్చిన గెయిడో స్వదేశానికి రావడం మదురో ప్రభుత్వానికి నేరుగా ఎదురైన సవాలుగా భావిస్తున్నారు. దీంతో ఉద్రిక్తతలు పెరిగాయి. శాంతియుతంగా ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిషేధాన్ని ఉల్లంఘించి విదేశాలకు వెళ్ళిన గెయిడోను రాగానే అరెస్టు చేస్తామని మదురో ప్రకటించారు. స్వదేశానికి వచ్చీ రాగానే గెయిడో శనివారం నిరసనలు చేపట్టాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa