ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీబీఎస్‌ వ్యాధి లక్షణాలివే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 12:01 PM

శ్రీకాకుళం జిల్లావాసులను కొత్త వైరస్‌ వణికిస్తోంది. మొన్నటి వరకూ మహారాష్ట్ర, తెలంగాణల్లో కలకలం రేపిన గులియన్‌ బారే సిండ్రోమ్‌ (జీబీఎస్‌).. ప్రస్తుతం రాష్ట్రంలో కూడా చాపకింద నీరులా వ్యాపించింది. జిల్లాలో అధికారుల నివేదిక ప్రకారం రెండు కేసులు నమోదయ్యాయి. ఇటీవల సంతబొమ్మాళి మండలంలో పదేళ్ల బాలుడు ఈ వ్యాధి లక్షణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లావాసులు భయాందోళన చెందుతున్నారు. కాగా.. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి.. అప్రమత్తం చేయాల్సిన వైద్యఆరోగ్యశాఖ మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. సంతబొమ్మాళి మండలంలో బాలుడి మరణించిన గ్రామంలో కొన్ని నమూనాలను వైద్యశాఖ అధికారులు సేకరించారు. ఆతర్వాత జీబీఎస్‌ గురించి ఎటువంటి అవగాహన కల్పించలేదు. విశాఖపట్నం వైద్యులు బాలుడి మృతికి జీబీఎస్‌ కారణం అని నిర్ధారించినా.. ఆ పరీక్షలు సరికాదని.. మరిన్ని పరీక్షలు నిర్వహిస్తేనే నిర్ధారించగలమని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. దీనిపై ప్రజలను గందరగోళానికి గురిచేయకుండా.. వైద్యఆరోగ్యశాఖ అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రజలు కూడా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించి.. మెరుగైన జీవనశైలి అలవరుచుకుంటే ప్రయోజనముంటుంది.గులియన్‌ బారే సిండ్రోమ్‌ (జీబీఎస్‌).. ఇది ఒక అరుదైన నరాల వ్యాధి. దీనిని ఆటో ఇమ్యూన్‌ వ్యాధి అని కూడా అనొచ్చు. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ, నరాలపై ఈ వైరస్‌ దాడి చేస్తుంది. ఫలితంగా కండరాల బలహీనత, గొంతు నొప్పి, నడవలేని స్థితి.. అలిసిపోయినట్లుగా అనిపిస్తుంటుంది. మొదటి దశలో చికాకు, నడుము నొప్పి ఉంటుంది. పెరాల్సిస్‌ మాదిరి పాదాలు, చేతులు, ముఖం నిశ్ఛేష్టంగా మారుతుంది. చర్మంలో సూది గుచ్చినట్లుగా అనిపిస్తుంది. చేతులు, కాళ్లలో బలహీనత, నడవలేసి స్థితి ఏర్పడుతుంది. కొన్ని కేసుల్లో కండరాలు పూర్తిగా పనిచేయకపోవడం, గుండె వేగం మారడం, ఊపిరితిత్తుల సమస్యలు సంభవిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు.. ఎక్కువగా వైరల్‌ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ తర్వాత కనిపిస్తాయి. బ్యాక్టీరియా(కెంపీనోబాక్టర్‌ జెజునీ) ఇన్ఫెక్షన్‌ వల్ల తీవ్రమైన నడుమునొప్పి, డయేరియా ముందుగా వస్తుంది. అలాగే ఇన్‌ఫ్లుయెంజా(ఫ్లూ), కొవిడ్‌-19 వంటి వైరస్‌ ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్‌, హెచ్‌ఐవీ వంటి వైరస్‌లు, వ్యాక్సినేషన్‌ (అలర్జిక్‌ ప్రతిస్పందన వల్ల కొందరిలో మాత్రమే వస్తుంది), శస్త్రచికిత్స, ఫిజికల్‌ ట్రామా (గాయం) ఇటువంటివి అనంతరం రేర్‌ ఘటనల్లో జీబీఎస్‌ సంభవించే అవకాశముంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa