ఉద్యోగం చేస్తున్నప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచించాలి. చిన్న వయసు నుంచే పెట్టుబడులు ప్రారంభించాలని ఆర్థిక నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. అయితే చాలా మంది ఈ విషయాన్ని విస్మరిస్తుంటారు. చివరకు పదవీ విరమణ చేసి ఖాళీగా ఉండే సమయంలో ఎలాంటి ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక కొందరు ఉద్యోగ విరమణ ద్వారా అందే గ్రాట్యూటీ, పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ద్వారా వచ్చే డబ్బులను నెల నెలా అవసరానికి సరిపడే రాబడి అందించే పథకాల్లో పెట్టుబడులు పెట్టి ఆర్థిక భరోసా కల్పించుకుంటారు. అయితే, ఇది అందరికి సాధ్యం కాకపోవచ్చు. 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత హైరిటర్న్స్ వచ్చే పథకాలను ఎంచుకోవడం చాలా రిస్క్ అని నిపుణులు చెబుతుంటారు. అందుకే సాంప్రదాయ పొదుపు పథకాలను సూచిస్తుంటారు. కానీ, హైరిటర్న్స్ రావాలని కొందరు రిస్క్ తీసుకుంటారు. అలా ఓ వ్యక్తికి నెల నెలా రూ.30 వేలు రావాలంటే ఏం చేయాలో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ప్రశ్న: నా వయసు 60 సంవత్సరాలు. నెల నెలా రూ.30 వేల వరకూ వచ్చేలా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం నా వద్ద రూ.30 లక్షల వరకు ఉన్నాయి. వాటిని ఏ పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి? నా ప్రణాళిక ఎలా ఉండాలి?
సమాధానం: మీ వద్ద ఉన్న రూ.30 లక్షలను పెట్టుబడి పెట్టడం ద్వారా నెల నెలా మీకు రూ.30 వేలు రావాలంటే కనీసం వార్షిక రాబడి 12 శాతంగా ఉండే పథకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇది అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. మీ వయసును దృష్టిలో ఉంచుకుని మీ పెట్టుబడిని బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్, హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈ పథకాల్లో నష్ట భయం అనేది తక్కువగా ఉంటుంది. మంచి రాబడులు ఉంటాయి. సిస్టమాటిక్ విత్ డ్రావల్ ప్లాన్ ద్వారా మీరు ఈక్విటీల్లో నెల నెలా డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఇందులో మీకు వడ్డీతో పాటుగా అసలు నుంచి కొంత చెల్లిస్తారు. ఇలా మీకు వచ్చే రాబడులను బట్టి మీకు ఎన్నేళ్లు రాబడి ఉంటుందని ఆధారపడి ఉంటుంది.
అలాగే మీరు రూ.30 వేలకు బదులుగా నెలకు రూ.22 వేలు వచ్చేలా ప్లాన్ చేసుకోవడం ద్వారా మీ పెట్టుబడి తగ్గే అవకాశాలు స్వల్పంగా ఉంటాయి. దీంతో ఎక్కువ కాలం నెల నెలా డబ్బులు పొందడంతో పాటుగా హైరిటర్న్స్ పొందవచ్చు. కనీసం 7 సంవత్సరాలు మదుపు చేస్తామని అనుకుంటేనే ఈ పద్ధతిని ఎంచుకోండి. మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలంలోనే మంచి రాబడులు ఉంటాయి. మీరు ఎంచుకునే స్కీమ్ గురించి పూర్తి వివరాలు ముందే తెలుసుకోవాలి. నిపుణుల సలహాలు కచ్చితంగా తీసుకోవాలి.
![]() |
![]() |