హైదరాబాద్‌లో ఉండే హర్ష (పేరు మార్చాం) స్టోరీ.. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్‌లు) కేవలం పెట్టుబడి సాధనాలు మాత్రమే కాదని, క్రమశిక్షణతో కూడిన టార్గెట్ ఓరియెంటెడ్ విధానంతో లాంగ్ రన్లో విజయాన్ని సాధించవచ్చని నిరూపిస్తుంది. ఇటీవల ఈటీ నౌ మనీ షోలో తన పెట్టుబడి ప్రయాణాన్ని పంచుకున్న హర్ష.. తన కుమార్తె ఉన్నత విద్య, వివాహం, తన పదవీ విరమణ కోసం ఎలా ఆర్థికంగా సిద్ధమవుతున్నాడో వివరించాడు. హర్ష కథ కేవలం సంఖ్యల గురించి కాదు - ఇది ఒక తండ్రి దూరదృష్టి, క్రమశిక్షణ, సరైన సమయంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాల పవర్‌ను తెలియజేస్తుంది. ఇప్పటి సిటీల్లో ఉండే భారతీయుల్లో చాలా మంది దీర్ఘకాలికంగా సంపదను పెంచుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్, సిప్‌లను ఆశ్రయిస్తున్నారని చెప్పడానికి హర్ష ఒక ఉదాహరణ.
హర్ష తన జీవితంలోని మూడు ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకున్నాడు. రాబోయే 12 సంవత్సరాలలో తన కుమార్తె ఉన్నత విద్య కోసం రూ. 1 కోటిని సమకూర్చాలని ఆశిస్తున్నాడు. 20 సంవత్సరాల తర్వాత జరగబోయే ఆమె వివాహం కోసం రూ. 75 లక్షలు సిద్ధంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. ఇంకా అదే 20 సంవత్సరాలలో.. 57 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేసే సమయానికి తన కోసం రూ. 2 కోట్ల పదవీ విరమణ నిధిని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఈ కోరికలు చాలా సాధారణమైనవి. మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలకు ఉత్తమ విద్యను అందించాలని, అంగరంగ వైభవంగా వివాహం జరిపించాలని, గౌరవప్రదమైన రిటైర్మెంట్ జీవితాన్ని గడపాలని కలలు కంటారు. హర్షను ప్రత్యేకంగా నిలబెట్టేది ఏమిటంటే, ఈ కలలను సాకారం చేసుకోవడానికి అతను తీసుకుంటున్న ముందుచూపు చర్యలు.
హర్ష పెట్టుబడులు ఇలా..
ప్రస్తుతం, హర్ష 4 మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు రూ. 40,000 (ఒక్కో ఫండ్‌లో రూ. 10,000) సిప్ల ద్వారా పెట్టుబడి పెడుతున్నాడు. వీటిలో పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్, హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీ క్యాప్ అనే రెండు ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్లతో పాటు టాటా స్మాల్ క్యాప్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ ఫండ్ ఉన్నాయి. తన నెలవారీ సిప్‌లతో పాటు, అతను JM ఫ్లెక్సీక్యాప్, క్వాంట్ లార్జ్ క్యాప్ అనే రెండు ఫండ్స్‌లో ఒక్కొక్కదానిలో రూ. 1.5 లక్షల చొప్పున ఒకేసారి పెట్టుబడి పెట్టాడు. అతని పోర్ట్‌ఫోలియో విలువ ఇప్పటికే రూ. 14 లక్షలకు చేరుకుంది. ఇంకా ఈ నెల (ఏప్రిల్ 2025) నుంచి తన నెలవారీ సిప్‌ను రూ. 15,000కు పెంచాలని యోచిస్తున్నాడు.
హర్ష చాలా విషయాలు సరిగ్గా చేసినప్పటికీ - స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం, ప్రారంభంలోనే పెట్టుబడి ప్రారంభించడం, క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వంటి వాటి గురించి- రైట్ హారిజన్స్ వ్యవస్థాపకుడు, CEO అయిన అనిల్ రేగో నుంచి మార్గదర్శకత్వం, సలహా కోరాడు. రేగో ప్రోత్సాహకరమైన మాటలతో పాటు కొన్ని ముఖ్యమైన సిఫార్సులు కూడా చేశారు.
లక్ష్యాలు చేరుకోవచ్చా?
రేగో అభిప్రాయం ప్రకారం.. హర్ష సరైన మార్గంలోనే ఉన్నాడు. అతను తన సిప్‌లను స్థిరంగా కొనసాగిస్తే, అనుకున్న విధంగా అదనంగా రూ. 15,000 జోడిస్తే, అతని కుమార్తె విద్య, వివాహానికి సంబంధించిన లక్ష్యాల్ని చేరుకోగలడు. అయితే, చాలా మంది పెట్టుబడిదారులు చేసే ఒక సాధారణ తప్పును రేగో ఎత్తి చూపారు. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని, ముఖ్యంగా పదవీ విరమణ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలపై తక్కువగా అంచనా వేయడం.
ఈ సందర్భంలో ఒకసారి ఆలోచించండి. 20 సంవత్సరాల క్రితం, మధ్యతరగతి వివాహానికి రూ. 5 నుండి రూ. 10 లక్షల మధ్య ఖర్చు అయ్యేది. నేడు, అదే వివాహానికి కనీసం ఐదు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతోంది. అదేవిధంగా, ఇప్పటి రిటైర్మెంట్ మొత్తంలా కనిపించేది రెండు దశాబ్దాల తర్వాత సరిపోకపోవచ్చు. రూ. 2 కోట్ల నిధి చాలా అనిపించవచ్చు, కానీ ద్రవ్యోల్బణం కారణంగా 20 సంవత్సరాల తర్వాత దాని కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోవచ్చు.
దీన్ని ఎదుర్కోవడానికి, రేగో హర్ష్ తన సిప్‌ను పెంచే ప్రణాళికకు కట్టుబడి ఉండాలని సూచించారు. అలా చేయడం ద్వారా, రాబోయే సంవత్సరాల్లో అతని ఆదాయం పెరిగేకొద్దీ మరింత పెంచడం ద్వారా, హర్ష పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఉండే మరింత దృఢమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించగలడని చెబుతున్నారు.
నిపుణుల సూచనలు..
ఈ చర్చలో వచ్చిన మరో అంశం ఫండ్ ఎంపిక. హర్ష పోర్ట్‌ఫోలియో కొన్ని అంశాలలో బలంగా ఉన్నప్పటికీ, దానిని సరళీకృతం చేయవచ్చని రేగో అభిప్రాయపడ్డారు. క్వాంట్ లార్జ్ క్యాప్ ఫండ్‌ను తొలగించాలని లేదా భర్తీ చేయాలని ఆయన సిఫార్సు చేశారు. ఇది హర్ష దీర్ఘకాలిక వ్యూహానికి పెద్దగా విలువను జోడించకపోవచ్చని ఆయన భావిస్తున్నారు. బదులుగా, పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్, హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీ క్యాప్ వంటి బాగా పనిచేస్తున్న ప్రస్తుత ఫండ్లలో పెట్టుబడులను కేంద్రీకరించాలని ఆయన సూచించారు. ICICI ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్ వంటి స్థిరమైన లార్జ్-క్యాప్ పనితీరు కనబరిచే ఫండ్‌ను కూడా పరిశీలించవచ్చని ఆయన సలహా ఇచ్చారు.
హర్ష కథ సిప్ల నిశ్శబ్ద శక్తిని గుర్తు చేస్తుంది. ఒక మామిడి చెట్టును నాటడాన్ని మీరు గుర్తుతెచ్చుకోండి లేదా ఊహించుకోండి. మీరు దానికి క్రమం తప్పకుండా నీరు పోస్తారు. ఓపికతో చూసుకుంటారు. సంవత్సరాలు గడిచేకొద్దీ, అది నీడను, పండ్లను, మొదట పెట్టుబడి పెట్టిన దానికంటే ఎక్కువ లాభాల్ని అందిస్తుంది. సిప్‌లు కూడా అదే విధంగా పనిచేస్తాయి. ప్రతి చిన్న మొత్తం పెట్టుబడి కూడా కాలక్రమేణా పెరుగుతుంది, మార్కెట్ వృద్ధి, రూపాయి విలువ పెరగడం వంటివి దీనికి దోహదం చేస్తాయి. మార్కెట్ క్షీణించినప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు ఆందోళన చెందుతారు. కానీ హర్ష యోచిస్తున్నట్లుగా, ఎవరైతే తమ పెట్టుబడిని కొనసాగిస్తారో, వారు తరచుగా దీర్ఘకాలంలో మంచి ఫలితాలను పొందుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa