ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా సంస్థ మాజీ అధినేత హసన్ నస్రల్లా (64) అంత్యక్రియలకు ఆయన మద్దతుదారులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో లెబనాన్ రాజధాని బీరూట్ నగర వీధులు కిక్కిరిసిపోయాయి. నగర శివారులోని స్టేడియం హెజ్బొల్లా నినాదాలతో హోరెత్తిపోయింది. గతేడాది సెప్టెంబరులో ఇజ్రాయేల్ వైమానిక దాడుల్లో నస్రల్లా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన దాదాపు ఐదు నెలలకు బీరూట్‌లో ఆయన అంత్యక్రియలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. నస్రల్లా బంధువు, హెజ్బొల్లా వారసుడిగా భావిస్తోన్న హషీమ్ సఫీద్దీన్‌కూ తుదివీడ్కోలు పలికారు ఇరువురి నేతలకు నివాళులు అర్పించేందుకు వచ్చిన వేలాది మంది హాజరయ్యారు.
లెబనాన్‌లోని అతిపెద్ద క్రీడా ప్రాంగణమైన బీరూట్ శివారులోని కామిల్లే చమౌన్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ఉంచి నస్రల్లా, హషీమ్ సఫీద్దీన్ భౌతికకాయాలను చూసేందుకు మహిళలు, చిన్న పిల్లలు సహా వేలాది మంది గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా అక్కడకు చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, అంత్యక్రియల సమయంలో బీరూట్ గగనతలంలో ఇజ్రాయేల్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టడం గమనార్హం.
గతేడాది సెప్టెంబరు 27న బీరూట్ దాహియా ప్రాంతంలోని హెజ్‌బొల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయేల్ వైమానిక దాడుల్లో నస్రల్లాతో పాటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన డిప్యూటీ కమాండర్ జనరల్ అబ్బాస్ నీలోఫరసన్ సహా పలువురు హెజ్బొల్లా నేతలు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత కొన్ని రోజులకు జరిగిన మరో దాడిలో సఫీద్దీన్ సైతం మృతి చెందారు. అప్పట్లో వీరికి తాత్కాలికంగా రహస్య ప్రదేశాల్లో ఖననం చేశారు. కానీ, తమ నాయకులు ఇద్దరికీ అధికారిక అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ ఇటీవల హెజ్బొల్లా ప్రకటించింది.
ఈ క్రమంలోనే బీరూట్‌లో నస్రల్లాకు, సఫీద్దీన్‌ను దక్షిణ లెబనాన్‌లోని ఆయన స్వస్థలంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. ప్రజల సందర్శనార్థం ఆదివారం వారి శవపేటికలను బీరూట్ శివారులోని స్టేడియానికి తరలించింది. శనివారం నుంచే హెజ్బొల్లా మద్దతుదారులు స్టేడియానికి చేరుకున్నారు. మొత్తం 50 వేల సామర్థ్యం ఉన్న ఆ స్టేడియం మైదానంతో పాటు బయట కూడా ఇందుకు వేలాదిగా అదనపు సీట్లను ఏర్పాటుచేశారు.
అటు, ఈ కార్యక్రమానికి 65 దేశాల నుంచి 800 మంది ప్రముఖులు హాజరైనట్టు హెజ్బొల్లా వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ తరఫున ఆ దేశ స్పీకర్ మహమ్మద్ బఘెర్ ఖాలిబఫ్, విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చి హాజరయ్యారు. అటు, నస్రల్లా అంత్యక్రియల సమయంలో బీరూట్ గగనతలంపై తమ ఫైటర్ జెట్లు చక్కర్లు కొడుతుండటంపై ఇజ్రాయేల్ రక్షణశాఖ మంత్రి కాట్జ్ స్పందించారు. తమ జోలికొస్తే ఎవరికైనా ఇదే దుస్థితి ఎదురవుతుందనే హెచ్చరికను చాటుతుందని ఆయన తెలిపారు. దీనికి తూర్పు, దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా ఆయుధ నిల్వల కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టినట్లు ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa