అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభా నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మళ్లీ నందమూరి బాలకృష్ణ పేరును పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. గురువారం అనంత నేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పకే మళ్లీ అవకాశం కల్పించారు. పెనుగొండ నుంచి పార్థసారథి, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం నుంచి వరదాపురం సూరి, మడకశిర నుంచి వీరన్న, రాప్తాడు నుంచి పరిటాల సునీతలు బరిలోకి దిగనున్నారు. కదిరి నియోజకవర్గ అభ్యర్థిని పెండింగ్‌లో పెట్టారు. ఈ స్థానానికి చాంద్‌పాషా, కందికుంట ప్రసాద్ పోటీ పడుతున్నారు.
దీంతో పాటు అనకాపల్లి, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గాలపైనా సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సమన్వయ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభా నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా ఈలి నాని పేరును చంద్రబాబు ఖరారు చేశారు. చివరి వరకూ బాపిరాజు పేరును పరిశీలించిన తెదేపా అధినేత, సామాజిక వర్గం సమీకరణలతో ఈలి నాని వైపు మొగ్గు చూపారు. అనంతరం బాపిరాజుకు పరిస్థితిని వివరించి సర్ది చెప్పారు. అంతేకాదు, ఆ స్థానాన్ని గెలిపించే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారు. భవిష్యత్‌లో బాపిరాజుకు అన్ని రకాలుగా ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘విభజన క్లిష్ట పరిస్థితుల నుంచి తెదేపానే ఒడ్డున పడేయగలదని ప్రజలు గెలిపించారు. ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితులను కూడా తెదేపానే ఎదుర్కొనగలదని జనాభిప్రాయం. ప్రధాని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి అశాంతిలోకి నెట్టారు. చెప్పకపోయినా రాష్ట్రంలో రైతుల రాబడి రెట్టింపు చేశాం. విభజన చట్టం హామీలను ఒక్కటి కూడా కేంద్రం అమలు చేయలేదు. జోన్ కావాలంటే విశాఖ పోవాలి.. డివిజన్ రావాలంటే విజయవాడ రావాలి. వాల్తేర్ డివిజన్ రద్దు భాజపా అన్యాయానికి పరాకాష్ట’’ అని విమర్శించారు.