ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలంతా బిచ్చగాళ్లలా మారి విపరీతంగా అడుక్కుంటున్నారు,,బీజేపీ మంత్రి

national |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 07:40 PM

మధ్య ప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రజలంతా అడుక్కునే అలవాటును విపరీతంగా పెంచుకుంటున్నారంటూనే.. బిచ్చగాళ్ల సైన్యాన్ని సమకూర్చడం వల్ల సమాజం ఏమాత్రం బాగు పడదంటూ వివరించారు. జనాలు అంతా యాచించడం మానేయాలని.. ముఖ్యంగా సమాజ బాగు కోసం కృషి చేసిన మహనీయుల గురించి తెలుసుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అసలీ వ్యాఖ్యలు ఎలా చేశారు, ఎందుకు చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ప్రస్తుత మధ్య ప్రదేశ్ రాష్ట్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ శనివారం రోజు ప్రజా డిమాండ్ల పిటిషన్లను భిక్షాటనగా అభివర్ణించడం వివాదానికి దారి తీసింది. మధ్య ప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో వీరాంగ రాణి అవంతిబాయి లోధి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రజలు ప్రభుత్వం నుంచి అడుక్కోవడం అలవాటు చేసుకున్నారని చెప్పుకొచ్చారు. నాయకులు వచ్చిన వెంటనే వారికి వినతి ప్రతాలతో నిండిన బుట్టలను అందజేస్తారన్నారు.


అలాగే వేదికపైకి పిలిచి దండలు వేసిన అనంతరమే వారి చేతుల్లో డిమాండ్ల లేఖను పెడతారని మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వివరించారు. ఇది మంచి అలవాటు కాదని.. అడగడానికి బదులుగా, ఇచ్చే మనస్తత్వాన్ని పెంచుకోండని చెప్పారు. ఇది సంతోషకరమైన జీవితానికి దారి తీస్తుందని.. సంస్కారవంతమైన సమాజాన్ని నిర్మించడంలో సహాయ పడుతుందని వెల్లడించారు. ఉచితాలపై అధికంగా ఆధారపడడం వల్ల పని చేయాలనే ఆలోచన కూడా కోల్పోతారన్నారు. ఈ యాచకుల సైన్యం సమాజాన్ని బలోపేతం చేయడం లేదని.. బలహీన పరుస్తుందని స్పష్టం చేశారు.


అంతేకాకుండా ఉచిత వస్తువుల పట్ల ఆకర్షణ.. ధైర్యవంతులైన మహిళల పట్ల గౌరవానికి చిహ్నం కాదన్నారు. మనం అమరవీరుల విలువలకు అనుగుణంగా జీవించినప్పుడే వారు నిజంగా గౌరవించ బడతారన్నారు. ఎప్పుడైనా భిక్షాటన చేసిన అమరవీరుడు ఉన్నాడా.. ఉంటే ఆయన పేరు చెప్పగలరా అంటూ ప్రజలను ప్రశ్నించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులు సైతం మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతు పట్వారీ స్పందిస్తూ.. ప్రజలను యాచకులతో పోల్చడం దారుణం అన్నారు. ఇంత ఘోరంగా అవమానించే హక్కు ఆయనకు ఎవరిచ్చారంటూ ఫైర్ అయ్యారు.


కష్టాలతో పోరాడుతున్న ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి బీజేపీ అహంకారంతో బిచ్చగాళ్లు అని సంబోధిస్తుందన్నారు. ఎన్నికలకు ముందు వాగ్దాలు చేశారు కాబట్టే.. ప్రజలు వాటిని గుర్తుంచుకుని నెరవేర్చాలని అడుగుతున్నారని.. ఇదెలా యాచించడం అవుతుందంటూ ప్రశ్నించారు. త్వరలోనే ఓట్లు అడుక్కోవడం కోసం ఇదే బీజేపీ నాయకులంతా యాచకుల్లా వస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa