కడప జిల్లాలోని సిద్ధవటం లంకమల అటవీ ప్రాంతం. 464.42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే లంకమల అభయారణ్యం. జీవ వైవిధ్యానికి ప్రతీక. అలాగే మానవ మనుగడకు మూలాధారంగా విరాజిల్లుతోందీ ఈ లంకమల అభయారణ్యం. ఈ ప్రాంతంలోని కొండలపై పలు రకాల శిల్ప రేఖా చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. మానవాకృతులు, పక్షులు, దేవతామూర్తులు, జంతువులు, సర్పాలు వంటి చిత్ర విచిత్రమైన చిత్రాలు ఈ కొండలపై కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే లంకమల అడవుల్లో ఆదిమానవులు గీసిన చిత్రాలు తాజాగా పురావస్తు శాఖ పరిశోధనల్లో బయల్పడ్డాయి.
ఇవి 800 నుంచి 2000 ఏళ్లకు పూర్వం నాటివిగా ఇనుప యుగానికి చెందినవిగా పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ చిత్రాలు మనుషుల బొమ్మలను, జంతువులను పోలి ఉన్నాయి. ఇక ఇటీవలి కాలంలో కనుగొన్న అతిపెద్ద పురావస్తు పరిశోధనగా పేర్కొంటున్నారు. వేల ఏళ్ల నాటి నుంచి ఇప్పటికీ ఇవి అలాగే చెక్కు చెదరకుండా ఉండటం విశేషం.
భారతీయ పురావస్తు శాఖ అధికారుల పరిశోధనల్లో రోలబోడు, మద్దూరు ప్రాంతంలోని కొండ గుహల్లో ఆదిమానవులు నివాసం ఉన్నట్లుగా ఆనవాళ్లు కనిపించాయి. అలాగే వారు గీసిన చిత్రాలు, ఉపయోగించిన పాత్రలను అధికారులు ఇప్పటికే గుర్తించారు. తాజాగా మూడు రాతి చిత్రాలను కనుగొన్నారు. ఒకదానిలో జంతువులు, రేఖాగణిత నమూనాలు, మానవుల చిత్రాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిని ఇనుప యుగం నాటివిగా అధికారులు భావిస్తున్నారు. ఈ చిత్రాలను జంతువుల కొవ్వు, ఎముకల పిండి వంటి సహజ పదార్థాలతో రూపొందించినట్లు చెప్తున్నారు.
అలాగే 4వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం కాలం నాటి రాతి శాసనాలు బయటపడినట్లు అధికారులు తెలిపారు. వీటిని బ్రాహ్మి, షెల్, సంస్కృతం, తెలుగు లిపితో రాసినట్లు వివరించారు. వీటి ద్వారా ఉత్తర భారతదేశం నుంచి అప్పట్లో లంకమల ప్రాంతానికి ఎక్కువగా వచ్చేవారని తెలుస్తోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శ్రీశైలానికి దక్షిణంగా ఉన్న నిత్యపూజకోన, అక్కదేవతల కొండ, బండిగాని చెల్లా ప్రాంతాలలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa