వినికిడిలోపం ఉన్న చిన్నారులకు కల్పతరువు శ్రవణం ప్రాజెక్ట్ అని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని శ్రవణం ప్రాజెక్ట్ 13వ వార్షికోత్సవం శుక్రవారం పాత మెటర్నిటి ఆసుపత్రి ఆవరణలోని శ్రవణం కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జెఈవో మాట్లాడుతూ సేవకు పరమావధి టిటిడి అని, అవసరమైన వారికి సేవ చేయడంలో ముందు వరుసలో ఉంటామని తెలిపారు. పుట్టుకతో వినికిడిలోపం ఉన్న చిన్నారులను గుర్తించి, వారికి తగిన వినికిడి యంత్రాలు అమర్చి, శిక్షణ ఇచ్చి వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు శ్రవణం సంస్థ కృషి చేస్తోందన్నారు. డిసెంబర్ 15, 2006లో స్థాపించబడిన ఈ సంస్థ 2008 ఏడాది నుండి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో 313 మంది పిల్లలకు శిక్షణ ఇచ్చి సాధారణ పాఠశాలలో చేర్పించారని అన్నారు. శ్రవణం సంస్థను అన్ని జిల్లాలలోనూ విస్తరింపచేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో జూన్ 1, 2012న విశాఖపట్ణణంలో ఉపకేంద్రాన్ని ప్రారంభించారన్నారు. శ్రవణం సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిని జెఈవో అభినందించారు.
ముందుగా అర్చకులు ప్రార్థన చేశారు. వార్షిక నివేదికను డిప్యూటీ ఈవో శ్రీమతి కె.భారతి నివేదించారు. చిన్నారులు నేర్చుకున్న పద్యాలు, పాటలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శ్రవణం సంస్థ ఇచ్చిన శిక్షణ మూలంగా తమ పిల్లలు వినికిడి లోపం నుండి సాధారణ స్థితికి వచ్చారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతిభ కనపరచిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa