రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మంత్రిగా వ్యవహరించిన గంటా శ్రీనివాసరావు... రాష్ట్ర విభజన తరువాత అనూహ్యంగా చంద్రబాబు మంత్రివర్గంలోనూ చోటు దక్కించుకున్నారు. సీనియర్ ఎమ్మెల్యే, విశాఖ జిల్లాలో మంచి పట్టు సంపాదించుకున్న ఆయనను... ఇప్పుడు బాలకృష్ణ అల్లుళ్లు ఇద్దరు టెన్షన్ పెడుతున్నట్టు జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరూ మరెవరో కాదు. ఒకరు బాలకృష్ణ పెద్దల్లుడు, ఏపీ మంత్రి లోకేశ్ కాగా, మరొకరు బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ మాజీ ఎంపీ మూర్తి మనవడు భరత్.
ఈ ఇద్దరు రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే వీరి పోటీ అనూహ్యంగా మంత్రి గంటా శ్రీనివాసరావుకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి లోకేశ్‌ను భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్న చంద్రబాబు... మంత్రి గంటాను విశాఖ ఎంపీగా పోటీ చేయాలని కోరినట్టు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు మంత్రి గంటా అంత సుముఖంగా లేరనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు బాలకృష్ణ చిన్నల్లుడు, మాజీ ఎంపీ మూర్తి మనవడు భరత్ సిద్ధం కావడంతో...అది కూడా మంత్రి గంటా సీటు అంశం పెండింగ్‌లో పడటానికి కారణమైందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ లోకేశ్ భీమిలి నుంచి పోటీ చేస్తే... భరత్ విశాఖ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. అప్పుడు మంత్రి గంటా శ్రీనివాసరావు మరో అసెంబ్లీ స్థానం నుంచో లేక ఎంపీగా పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే భరత్ టీడీపీ తరపున విశాఖ ఎంపీగా పోటీ చేస్తే మాత్రం మంత్రి గంటా శ్రీనివాసరావు ఇబ్బందులన్నీ తొలగినట్టే అని పలువురు అభిప్రాయపడుతున్నారు భరత్ ఎంపీగా పోటీ చేస్తే... లోకేశ్ భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువ అని జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ల పోటీపై క్లారిటీ వస్తేనే మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్లీ భీమిలి నుంచి పోటీ చేసే అంశంపై స్పష్టత వచ్చేలా కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa