తిరుమలలో అందించే శ్రీవారి అన్నప్రసాదంలోకి మరో కొత్త వంటకం చేరింది.. నేటి నుంచి వడను కూడా మెనూలో చేర్చారు. ఈ మేరకు శెనగపప్పు వడల్ని వడ్డింపు కార్యక్రమం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ముందుగా వడల్ని స్వామి అమ్మవార్ల చిత్రపటాలు వద్ద ఉంచి పూజలు నిర్వహఇంచారు. అనంతరం టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈవోలు భక్తులకు స్వయంగా వడలు వడ్డించారు. వడలు రుచిగా, కమ్మగా ఉన్నాయంటూ భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించాక అన్నప్రసాదం మెనూలో అదనంగా ఒక పదార్థం పెట్టాలని ఆలోచన తనకు వచ్చిందన్నారు బీఆర్ నాయుడు. తన ఆలోచనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని.. ఆయన అంగీకారంతో వడల్ని అన్నప్రసాదంలో ప్రవేశపెట్టామన్నారు. నాణ్యమైన దినుసులతో భక్తులు రుచికరమైన అన్నప్రసాదాలను వడ్డిస్తున్నారని.. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతిరోజు 35 వేల వడల్ని భక్తులకు వడ్డిస్తామన్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి, భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామన్నారు.
గతేడాది నవంబర్‌లో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో.. తిరుమల అన్న ప్రసాదంలో వడను కూడా చేర్చాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ ఏడాది జనవరిలో ప్రయోగాత్మకంగా మసాలా వడను అన్న ప్రసాదంలో వడ్డించారు. ముందుగా టీటీడీ ట్రయల్ రన్ నిర్వహించారు. జనవరిలో ఉల్లి, వెల్లుల్లి లేకుండా 5 వేల వడలను తయారు చేసి భక్తులకు వడ్డించిన సంగతి తెలిసిందే. కొన్నిరోజుల పాటు భక్తులకు వడ తయారు చేసి వడ్డించి ఫీడ్ బ్యాక్‌ను తీసుకున్నారు. భక్తుల నుంచి వడ బావుందనే ఫీడ్‌బ్యాక్ రావడంతో టీటీడీ అన్నప్రసాద మెనూలో మసాలా వడను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే టీటీడీ అన్నదానంలో అదనంగా మసాలావడను చేర్చి భక్తులకు నేటి నుంచి వడ్డిస్తున్నారు.. భక్తులు కూడా వడ రుచిగా ఉందని చెబుతున్నారు.
శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 46వ వర్ధంతి
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సం కీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు వందల కృతులను స్వరపరిచిన సంగీత, సాహిత్య విద్వాంసులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 46వ వర్ధంతి కార్యక్రమం మార్చి 11న టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పిజి కళాశాల ప్రాంగణంలోని శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు సాహితీ సదస్సు ప్రారంభం కానుంది.
శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ అనంతపురం జిల్లా రాళ్లపల్లి గ్రామంలో 1893, జనవరి 23న జన్మించారు. మైసూరు మహారాజ కళాశాలలో 38 సంవత్సరాలు తెలుగు ఆచార్యులుగా సేవలందించారు. రేడియోకు ‘‘ఆకాశవాణి’’ అని పేరు పెట్టింది వీరే. వీరి ప్రతిభను గుర్తించి అప్పటి టీటీడీ ఈవో శ్రీ చెలికాని అన్నారావు 1949లో శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థ బాధ్యతలను అప్పగించారు. అప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలోని తాళ్లపాక అరలోంచి వెలుగుచూసిన సంకీర్తనలను పరిష్కరించే బాధ్యతను వారికి అప్పగించారు. సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు కొన్ని వందల సంకీర్తనలను ఆయన స్వరపరిచారు. శ్రీఅనంతకృష్ణశర్మను 1979, మార్చి 11న టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా నియమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa