చాలామంది యువనేతలు, వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వస్తున్నారు.. ఇదేం కొత్త విషయం కాదుకదా అనుకునేవారు లేకపోలేదు. కానీ శ్రీకాంత్ బొల్ల అందరిలాంటి వ్యక్తి కాదు. సమ్‌థింగ్ స్పెషల్. సాధించాలనే పట్టుదల ముందు పుట్టుక తో వచ్చిన అంధత్వం కూడా తలవంచాల్సిందేనని నిరూపించిన వ్యక్తి. యువతరానికి ఆదర్శంగా నిలిచిన వాడు. ఆంధ్రప్రదేశ్‌లో మచిలీపట్నానికి చెందిన శ్రీకాంత్ బొల్ల నిరుపేద కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు దినసరి కూలీలు. పుట్టుకతోనే అంధత్వంతో బాధపడుతున్న ఆయన.. ఎంతో కష్టపడి, ఇష్టపడి విద్యనభ్యసించాడు. తన వైకల్యాన్ని చదువుకు ఏనాడు అడ్డుకానివ్వలేదు. భారత దేశంలోనే తొలిసారిగా ఇంటర్మీడియట్ స్థాయిలో సైన్స్ సబ్జెక్ట్‌లో చేరిన అంధ విద్యార్థిగా చరిత్ర సృష్టించాడు శ్రీకాంత్ బొల్ల. ఇక్కడి అత్యున్నత యూనివర్సిటీలు అంధత్వం సాకుచూపి శ్రీకాంత్‌కు ప్రవేశాన్ని నిరాకరిస్తే.. ఏకంగా మాసచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) అతని టాలెంట్‌కు ఎర్ర తివాచీ పరిచింది.
అనంతరం, యూఎస్‌కు చెదిన జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో మంచి జాబ్ ఆఫర్‌ను వదులుకుని ఇండియాకొచ్చిన శ్రీకాంత్.. తనలా అంగవైకల్యంతో బాధపడుతున్న వారికోసం ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకే హైదరాబాద్ కేంద్రంగా.. ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్‌ను తయారు చేసే ఒక కంపెనీని స్థాపించారు. అందులో 70 శాతం మంది ఉద్యోగులను అంగవైకల్యంతో బాధపడే వారినే నియమించి.. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. కొద్ది కాలంలోనే ఆ సంస్థను కోట్ల టర్నోవర్‌కు ఎగబాకేలా చేయడంలో సక్సెసయ్యారు.
9వ తరగతిలో ఉండగా అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాంను కలిసే అవకాశం వచ్చింది శ్రీకాంత్‌కు. అలా విద్యార్థులందరితో ముఖాముఖిగా మాట్లాడుతున్న కలాం.. శ్రీకాంత్‌ను పెద్దయ్యాక ఏమవుతావని ప్రశ్నించారు. వెంటనే, తాను భారత దేశానికి తొలి అంధ రాష్ట్రపతిని కావాలనుకుంటున్నానని బదులిచ్చారు శ్రీకాంత్. ఆ సమాధానానికి ఎంతో మురిసిపోయిన కలాం.. శ్రీకాంత్ ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకున్నారు.
శ్రీకాంత్ బొల్ల జాతీయ స్థాయి చెస్ ప్లేయర్. అంతేకాదు, జాతీయ స్థాయిలో బ్లైండ్ క్రికెట్ ప్లేయర్ కూడాను. అంధుడైనప్పటికీ కష్టపడి ఉన్నతస్థాయికి ఎదిగి కోట్లమంది యువతకు ఆదర్శంగా నిలిచిన శ్రీకాంత్ బొల్ల ఇప్పుడు రాజకీయాల్లో వస్తున్నారనే ప్రచారం సంచలనం రేపుతోంది. ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరబోతున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఆయన ఆ పార్టీ కండువా కప్పుకోబోతున్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa