ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మ కోరిందని, లక్షల జీతం, విలాసమైన జీవితం వదిలేసి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 09, 2025, 05:48 PM

ధర్మం నాలుగు పాదాల మీద నడవడానికి ఇది కృతయుగం కాదు.. కలియగం. ధర్మాధర్మ విచక్షణ మరిచి మనిషి ప్రవర్తిస్తున్న సమయమిది. ఆటవిక దశ నుంచి అభివృద్ధి చెందుతూ నాగరిక సమాజంలోకి వచ్చిన మనిషి.. క్రమంగా తన ప్రవర్తనతో అనాగరికం వైపు వెళ్తున్న దుస్థితి. ఉదయాన్నే పేపర్ తీస్తే.. ఆస్తి కోసం తాతను హత్య చేసిన మనవడు, అమ్మను కడతేర్చిన తనయుడు.. ఇలాంటి ఘటనలు ఎన్నో. కానీ అమ్మ కోరిందని.. లక్షల జీతం ఇచ్చే ఉద్యోగాన్ని వదిలి తల్లి కోరిక నెరవేర్చడం కోసం కదిలిన ఓ తనయుడి కథ ఇది. తీర్థయాత్రలు చేస్తూ దేవుడి సేవతో పాటు తల్లి సేవలో తరిస్తున్న ఓ అభినవ శ్రవణ కుమారుడి నేపథ్యమిది.


అతని పేరు కృష్ణకుమార్. ఊరు మైసూరు. బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ కొలువు. లక్షల్లో జీతం, విలాసమైన జీవితం. తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. దీంతో గారాబంగా పెంచారు. అతను కూడా తల్లిదండ్రులపై అంతే ఆప్యాయతను పెంచుకున్నాడు. అయితే నాలుగేళ్ల క్రితం ఆ కుటుంబంలో విషాదం నిండుకుంది. కృష్ణ కుమార్ తండ్రి దక్షిణామూర్తి అకస్మాత్తుగా చనిపోయారు. దీంతో కృష్ణ కుమార్ తల్లి రత్నమ్మ క్రుంగిపోయింది. కట్టుకున్నవాడు దూరం కావటంతో తీవ్ర మనోవేదనకు గురైంది. తల్లి పరిస్థితిని చూసి ఇంటికి వచ్చేశారు కృష్ణ కుమార్. తల్లి బాగోగులు చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తీర్థయాత్రలు చేయాలని ఉందని అమ్మ అడగటంతో కృష్ణ కుమార్ కాదనలేకపోయారు.


అమ్మ కోరిక తీర్చడం కోసం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తండ్రి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న స్కూటర్ మీద తల్లితో కలిసి తీర్థయాత్రలు మొదలుపెట్టారు. 2018 జనవరి 14నఈ తీర్థ యాత్రలు ప్రారంభించారు. మాతృసేవా సంకల్ప యాత్ర పేరుతో తీర్థయాత్రలకు శ్రీకారం చుట్టారు. అలా అప్పటి నుంచి ఇప్పటివరకు కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గోవా, మహారాష్ట్ర, నాగాలాండ్, అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం,రాష్ట్రాలలోని ఆలయాలను సందర్శించారు. మనదేశంతో పాటుగా నేపాల్, భూటాన్, మయన్మార్‌‌లోని ఆలయాలను తల్లితో కలిసి కృష్ణకుమార్ దర్శించుకున్నారు. శనివారం కాకినాడ చేరుకున్న వీరిద్దరూ.. సూర్యారావుపేటలోని రాఘవేంద్రస్వామి మఠాన్ని దర్శించుకున్నారు.


ఇప్పటి వరకూ స్కూటర్ మీద 92,591 కిలోమీటర్ల ప్రయాణం చేశామన్న కృష్ణకుమార్.. అమ్మ కోరికను కాదనలేక ఇలా తీర్థయాత్రలకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. తల్లి సేవలో ఎంతో సంతృప్తి దక్కుతోందన్నారు. మరోవైపు 2019లో దక్షిణామూర్తి కృష్ణకుమార్ కథ గురించి తెలుసుకున్న మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. అతని తల్లిప్రేమకు ముగ్ధుడై.. కృష్ణకుమార్‌కు ఎస్‌యూవీ వాహనం బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. మరోవైపు 13 ఏళ్ల పాటు వివిధ కంపెనీలలో పనిచేసిన కృష్ణ కుమార్ ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదు. ఉద్యోగ జీవితంలో తాను సంపాందించిన డబ్బుతోనే ఈ తీర్థయాత్రలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa