దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తూ.. బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఆమెను విచారణ జరపగా.. తాజాగా ఈ కేసులోకి సీబీఐ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ కేసు శరవేగంగా దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో రన్యారావుతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనేది గుర్తిచేందుకు సీబీఐ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అందుకు ఆమె పెళ్లికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక సీబీఐ అధికారులు రన్యారావు ఇల్లు, ఆమెకు సంబంధించిన ప్రాంతాలు, ఆమె పెళ్లి చేసుకున్న హోటల్‌కు వెళ్లి విచారణ జరిపారు. అయితే రన్యారావు పెళ్లి వేడుకకు హాజరైన వారు, అతిథులు ఇచ్చిన ఖరీదైన కానుకలపైనా సీబీఐ దృష్టి సారించనుంది. ఇందుకోసమే రన్యారావు పెళ్లి వీడియోను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు రన్యారావు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే.. రన్యారావు బెయిల్‌పై అభ్యంతరాలను సమర్పించాలని డీఆర్‌ఐ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు.. గోల్డ్ స్మగ్లింగ్ చేసే సమయంలో ఎయిర్‌పోర్టులో వీఐపీ ప్రొటోకాల్‌ను రన్యారావు దుర్వినియోగం చేసినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెకింగ్స్‌ను తప్పించుకునేందుకు ఆమె సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రరావు పేరును ఆమె వాడుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కర్ణాటక సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ బంగారం అక్రమ రవాణా వ్యవహారంలో రన్యారావు తండ్రి కె.రామచంద్రరావు పాత్ర ఉందా లేదా అనే విషయంపైనా దృష్టి పెట్టాలని తెలిపింది. ఇక ఈ రన్యరావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు విచారణ అధికారిగా అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తాను సిద్ధరామయ్య ప్రభుత్వం నియమించింది.
ఇటీవల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో రన్యా రావును డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఆమె వద్ద నుంచి రూ.12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారాన్ని ఈనెల 3వ తేదీన స్వాధీనం చేసుకున్నారు. ఇక 4 నెలల క్రితం రన్యా రావును జితిన్ హుక్కేరి అనే ఆర్కిటెక్ట్‌ను బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్‌లో ఘనంగా పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ పెళ్లి వచ్చిన అతిథుల లిస్ట్‌ను తీసుకున్న సీబీఐ అధికారులు.. వారు ఎలాంటి ఖరీదైన బహుమతులు ఇచ్చారు అనేది ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే రన్యా రావు వెనుక ఓ మంత్రి ఉన్నట్లు కూడా తీవ్ర ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం ఏకంగా కర్ణాటక అసెంబ్లీలో తీవ్ర రచ్చకు కారణం అయింది. అధికార కాంగ్రెస్ పార్టీపై.. ప్రతిపక్ష బీజేపీ ఈ కేసు గురించి ప్రశ్నల వర్షం కురిపించింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa