కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన కుమారుడు కిరీట్ రెడ్డి, కూతురు బ్రాహ్మణి దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 53 కిలోల బంగారం, బాండ్ల విడుదల కోరుతూ వారు మూడు పిటిషన్లు దాఖలు చేశారు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉన్న బాండ్లు, బంగారు ఆభరణాలను విడుదల చేసేలా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.2011 సెప్టెంబర్ 5వ తేదీన ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అరెస్టు సమయంలో ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో 53 కిలోలున్న 105 బంగారు ఆభరణాలు, నగదు, బాండ్లను సీబీఐ సీజ్ చేసింది. వీటిని విడుదల చేయాలంటూ ఈ ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టి వేసింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం వారి పిటిషన్లను కొట్టి వేసింది. సీబీఐ కోర్టులోనే పరిష్కరించుకోవాలని హైకోర్టు తెలిపింది.
![]() |
![]() |