ఉక్రెయిన్‌తో 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా చేసిన ప్రతిపాదనలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సూత్రప్రాయంగా అంగీకరించారు. కానీ దీనికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై ఇంకా కసరత్తు జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచన సరైందేనన్న ఆయన.. కచ్చితంగా మేము మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. అయితే, కొన్ని సమస్యలు ఉన్నాయని, దీనిపై అమెరికా మిత్రులు, ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తామని వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం జరిగిన మీడియా సమావేశంలో కాల్పుల విరమణ అంశంపై పుతిన్ స్పందించారు.
ఒప్పందం ఉల్లంఘన జరగకుండా.. సరైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. యుద్ధాన్ని ముగించాలనే ప్రతిపాదనకు తాము అంగీకరిస్తున్నామని చెప్పారు. కానీ, కాల్పుల విరమణ శాశ్వత శాంతి దిశగా సాగుతుందని ఆశాభావంతో అందరం ముందుకు వెళ్లాలని పుతిన్ వ్యాఖ్యానించారు. కాల్పుల విరమణకు అమెరికా ఒప్పించినట్టే కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై అంచనాకు వచ్చాకే ఉక్రెయిన్ అంగీకరించిందని చెప్పడం గమనార్హం. ఉక్రెయిన్, రష్యా వివాదాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తోన్న డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలకు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు.
అలాగే, బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా నేతలకూ ఆయన కృతజ్ఞతలు చెప్పారు. శత్రుత్వాన్ని ఆపడం, ప్రాణనష్టాలను నివారించడమనే గొప్ప లక్ష్యం కోసమే ఈ దేశాలు చాలా సమయం కేటాయించాయని అన్నారు. ఈ నేపథ్యంలో శాంతి ఒప్పందంలో ఈ దేశాలు కూడా ముఖ్య భూమిక పోషించాయన్న సంకేతం ఇచ్చారు. కాగా, ఉక్రెయిన్, రష్యాలు సంఘర్షణలో భారత్ ముందు నుంచి ఒకే వైఖరితో ఉంది. సంప్రదింపులు, ద్వైపాక్షిక చర్చలతోనే వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. గత నెలలో అమెరికా పర్యటనకు వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ.. డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన భేటీలోనూ ఇదే విషయాన్ని స్ఫష్టం చేశారు. ‘రష్యా ఉక్రెయిన్ సంఘర్షణలో భారత్‌ది తటస్థ వైఖరి కాదు.. శాంతినే కోరుకుంటోంది.. ఇది యుద్ధాల యుగం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సైతం చెప్పానను.. యుద్దం ముగింపులో ట్రంప్ తీసుకున్న చొరవకు మా మద్దతు ఉంటుంది’ అని మోదీ స్పష్టం చేశారు.
మరోవైపు, కాల్పుల విరమణకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించడాన్ని ట్రంప్ స్వాగతించారు. యుద్ధ విరమణపై రష్యా నుంచి మంచి సంకేతాలొచ్చాయని,. పుతిన్‌తో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ తెలిపారు. అయితే, దీనికి ముందు రోజు వైట్‌హౌస్ వద్ద ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా అంగీకరించాల్సిందేనని, లేకుంటా వినాశకరమైన ఆంక్షలు తప్పవని హెచ్చరించారు.
![]() |
![]() |